భద్రకాళి చెరువుకు గండి ... ఉలిక్కిపడ్డ ఓరుగల్లు

  • భద్రకాళి చెరువుకు గండి ...  ఉలిక్కిపడ్డ ఓరుగల్లు 
  • గండి పూడ్చడంతో తప్పిన ముప్పు.. అర్ధరాత్రి వరకు పనులు 
  • ప్రతిపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు.. స్వల్ప ఉద్రిక్తత 
  • కొందరు చెరువును  ఆక్రమించుకున్నరు: ఎర్రబెల్లి

హనుమకొండ/వరంగల్, వెలుగు: వరంగల్ నగరం నడి మధ్యలో ఉన్న భద్రకాళి చెరువుకు గండి పడింది. దీంతో ఓరుగల్లు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే భారీ వర్షాలు,  వరదలతో సిటీ నీట మునిగింది. ఇప్పుడిప్పుడే ముంపు నుంచి తేరుకుంటున్నది. ఇంతలో శనివారం చెరువుకు గండి పడడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై గండి పూడ్చడంతో ముప్పు తప్పింది. దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని రోజులు కురిసిన వర్షాలు, బొందివాగు నుంచి వస్తున్న వరదతో భద్రకాళి చెరువు పూర్తిగా నిండింది.

ఉదయం 11 గంటల టైమ్​లో కట్ట కోతకు గురై పోతన నగర్​వైపు చెరువుకు గండి పడింది. నాలాల్లో వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో సమీపంలోని పోతన నగర్, రాజీవ్ కాలనీ, సరస్వతి, జ్ఞాన సరస్వతి కాలనీల్లో భయాందోళన మొదలైంది. విషయం తెలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య తదితరులు స్పాట్ కు వచ్చి పరిశీలించారు. వెంటనే కట్టకు రిపేర్లు చేయాలని అధికారులు, కాంట్రాక్టర్​ను ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సమీప కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ ​సిబ్బందిని మోహరించారు. ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగి.. మధ్యాహ్నం పనులు ప్రారంభించారు. జేసీబీలతో రాళ్లు తెచ్చి గండి పూడ్చి వేయించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు పనులు కొనసాగాయి. రూ.65 కోట్లతో భద్రకాళి బండ్ డెవలప్ చేస్తున్నా, కట్టను మాత్రం పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బీజేపీ కార్యకర్తలను కొట్టిన పోలీసులు 

చెరువుకు పడ్డ గండిని పరిశీలిచేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు నాయిని రాజేందర్​రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, బీజేపీ రాష్ట్ర​అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తదితరులను ఆపేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత రాకేశ్ రెడ్డి, కార్యకర్తలు పురుషోత్తం, అనిల్ ను పోతననగర్​దగ్గర పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరగడంతో చివరికి రాకేశ్ రెడ్డిని మాత్రం పంపించారు. ఆ తర్వాత కార్యకర్తలు పురుషోత్తం, అనిల్ ను ఇంతేజార్ గంజ్ సీఐ ముష్క శ్రీనివాస్ గల్లాలు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. చెవులు, ముఖంపై కొట్టారు. వెహికల్​లో ఎక్కించి ‘ఫాల్తు రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు. కాగా, గాయపడిన కార్యకర్తలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్ అందించారు. సీఐ శ్రీనివాస్ పై సీపీ రంగనాథ్​కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఆక్రమణలు తొలగిస్తం: ఎర్రబెల్లి  

భద్రకాళి చెరువును 20, 25 ఏండ్ల కింద కొంతమంది దొంగ కాగితాలు సృష్టించి ఆక్రమించుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ఆయన శనివారం మధ్యాహ్నం గండిని పరిశీలించి, ప్రమాదమేమీ లేదని చెప్పారు. ‘‘చెరువును ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు వాటిని తొలగించాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. నాలాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఇండ్లు కోల్పోయే పేదలు ఎవరైనా ఉంటే, వేరే చోట స్థలాలు ఇస్తం” అని చెప్పారు.