ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనలో భాగంగా 2023 జూలై 08 శనివారం రోజున ఉదయం 10 : 30 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ 10 : 45 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలకరించారు అధికారులు. రంగురంగుల పూలుతో ఆలయాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు. మరోవైపు భద్రాకాళి అమ్మవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసులు.
మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా వరంగల్ పట్టణం ముస్తాబైంది. 30 ఏళ్ల తర్వాత ప్రధాని వరంగల్ కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దాదాపు 30 ఏళ్ల కిందట ప్రధాని హోదాలో పీవీ నర్సింహారావు వరంగల్ కు రాగా, ఆ తర్వాత ఇప్పుడు మోడీ వస్తున్నారు.
రెండున్నర గంటల పాటు కొనసాగనున్న తన టూర్‌లో.. మొత్తం రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, రూ.5,550 కోట్లతో 176 కిలోమీటర్ల జాతీయ రహదారులు సహా మొత్తం రూ.6,100 కోట్ల పనులను ప్రారంభించనున్నారు. తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు శుక్రవారమే వరంగల్ చేరుకొని జన సమీకరణ, సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనం భారీగా వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు