పూడిక మట్టికి..ఫుల్​ డిమాండ్​..తగ్గిన భద్రకాళి చెరువు మట్టి రేటు

పూడిక మట్టికి..ఫుల్​ డిమాండ్​..తగ్గిన భద్రకాళి చెరువు మట్టి రేటు
  • క్యూబిక్​ మీటర్​ ధర రూ.72కు తగ్గింపు
  • పోటాపోటీగా 4.60 లక్షల క్యూబిక్​ మీటర్లకు దరఖాస్తులు
  • మొన్నటివరకు క్యూబిక్‍ మీటర్ ధర రూ.162.56 
  • రెండుసార్లు వేలంపాట.. అయిన ముందుకురాని వైనం  
  • ఇప్పుడు కొందరికి మేలు చేసేలా ధరలు తగ్గించారనే ఆరోపణలు

వరంగల్, వెలుగు: ఓరుగల్లు భద్రకాళి ఆలయ చెరువు మట్టి విక్రయ ధరను అధికారులు గతంలో నిర్ణయించిన రేటులో సగం కంటే ఎక్కువ తగ్గించారు. ఇరిగేషన్ శాఖ మొదట చెరువులోని క్యూబిక్‍ మీటర్ మట్టికి ధర రూ.162.56 చొప్పున అమ్మేందుకు రెడీ అయింది. 3 బ్లాకులుగా 5,85,000 క్యూబిక్‍ మీటర్లు తవ్వుకోవడానికి రూ.9 కోట్ల 50 లక్షల 98 వేల అంచనాతో టెండర్లు పిలిచారు. 

జనవరిలో రెండో, నాలుగో వారాల్లో రెండుసార్లు టెండర్లను ఆహ్వానించింది. ఎవరూ ముందుకురాకపోవడంతో క్యూబిక్‍ మీటర్ ధర రూ.162 నుంచి రూ.72కు తగ్గించారు. రైతులు, ఇటుక బట్టీల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా మట్టికి డిమాండ్‍పెరిగింది. జనాలు, పలువురు కాంట్రాక్టర్లు పోటాపోటీగా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. 

ఆలయానికి మాడవీధులు.. చెరువుకు పూడికతీత

రాష్ట్ర ప్రభుత్వం భద్రకాళి ఆలయం చుట్టూరా మాడవీధులు, రాజగోపురాలు నిర్మించడానికి సమాయత్తమైంది. నవంబర్‍ లో జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాడవీధుల బ్రిడ్జి నిర్మాణ పనులకు చెరువులోని నీటి మళ్లింపు కొంత సమస్యగా భావించారు. 

మేధావులతో చర్చించాక దాదాపు 382 ఎకరాల్లో విస్తరించి ఉన్న భద్రకాళి చెరువులో పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. కాగా, భద్రకాళి చెరువులో 50 ఏండ్లకు ముందు ఒకసారి పూర్తిస్థాయిలో పూడికతీత ప్రకియ చేపట్టగా, మళ్లీ ఇప్పుడు ముందుకొచ్చారు.

మూడు నెలలైన మొదలుకాని పనులు..

భద్రకాళి చెరువు పూడికతీత పనులు చేపట్టే క్రమంలో అందులో అడవి తుంగ, వ్యర్థాలతో కూడిన బురద మట్టి పేరుకుపోవడం సమస్యగా మారింది. చెరువులో 140 నుంచి 150 మిలియన్‍ క్యూబిక్ ఫీట్ల నీరు నిల్వ ఉండగా, పూడికతీత నిర్ణయంతో నవంబర్ 8న నీటిని వదిలే పనిమొదలుపెట్టారు. 10 నుంచి 12 రోజుల్లో నీరు ఖాళీ అయి రాళ్లు, బండలు తేలాయి. వారం, పది రోజుల్లో బురద ఆరగానే పూడికతీత పనులు మొదలు పెడ్తమని అధికారులు చెప్పారు. తీరాచూస్తే మూడు నెలల సమయం గడిచినా ఇంకా అసలు పనులు మొదలవలేదు. 

భద్రకాళి చెరువు పూడికతీత అంశం నవంబర్‍ లో ప్రారంభమవగా, వేసవిలో పూర్తిస్థాయి పనులు నిర్వహించి, ఈ ఏడాది జూన్‍ లో వానల సమయానికి నీటిని వినియోగించుకునేలా ప్లాన్‍ చేశారు. చెరువులోని 5,85,000 క్యూబిక్‍ మీటర్ల మట్టిని తరలించేందుకు రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ రాలేదు. మరోసారి టెండర్లకు వెళ్దామంటే ఎమ్మెల్సీ ఎలక్షన్‍ కోడ్‍ అడ్డం వచ్చింది. 

రేటు తగ్గడంతో వెల్లువెత్తిన దరఖాస్తులు..

భద్రకాళి చెరువులో ప్రస్తుతం నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గి చుట్టూరా ఉండే దాదాపు 50 కాలనీలకు నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. మరోవైపు పనులు పూర్తి చేయడానికి పెట్టుకున్న గడువు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో అధికారులు ప్రధాన సమస్యగా ఉన్న మట్టి తరలింపునకు పరిష్కారంగా క్యూబిక్‍ మీటర్‍ ధరను రూ.162 నుంచి ఏకంగా సగానికంటే తక్కువగా రూ.72కు తగ్గించారు. ఈ ప్రకటనతో చెరువులోని 5,85,000 క్యూబిక్‍ మీటర్లకు మట్టికిగానూ 4లక్షల 60 వేల క్యూబిక్‍ మీటర్ల మట్టిని తీసుకువెళ్లేందుకు జెట్‍ స్పీడుతో దరఖాస్తులు వచ్చాయి.

ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, కొందరికి మేలు చేయడం కోసమే అధికారులు మట్టి ధరలను తగ్గించారనే ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ సమయంలో అధికారులు క్యూబిక్‍ మీటర్ రూ.162 పెట్టగా, కొంత తక్కువ ధరతో ఒకట్రెండు దరఖాస్తులు వచ్చినా కూడా క్యాన్సల్‍  చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడేమో గతంలో కంటే ఏకంగా 55 శాతం ధరలు తగ్గించి, తమకు కావాల్సినవారితో రైతుల రూపంలో దరఖాస్తులు పెట్టించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. 

గడువు దగ్గర పడ్తున్న నేపథ్యంలో పనులు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్‍ ప్రావీణ్య, బల్దియా కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడే అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో కలిసి భద్రకాళి చెరువు పనుల ప్రాంతాన్ని పరిశీలించారు.