దేశం ప్రమాదంలో పడిందని కేసీఆర్ బాధపడుతున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. మోడీ సర్కారుపై పోరాటం చేస్తున్న ఆయనకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్బుతంగా ఉన్నాయని అందుకే దేశమంతా తెలంగాణ పేరు మార్మోగుతోందని ప్రశంసించారు. కంటి వెలుగు లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పంజాబ్ లోనూ కంటి వెలుగు తరహా స్కీం అమలు చేస్తామని మాన్ ప్రకటించారు. ప్రజల అభిమానాన్ని దేనితోనూ కొనలేరన్న ఆయన.. ప్రజలు తలుచుకుంటే ఎంత పెద్ద నేతలనైనా కూకుటివేళ్లతో పెకిలిస్తారని అన్నారు.
దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ప్రభుత్వాలను కూల్చడం వెన్నతో పెట్టిన విద్య అని భగవంత్ మాన్ అన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోందని వాపోయారు. బీజేపీ చెప్పే ప్రతి మాట అబద్ధమేనన్న ఆయన.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బీజేపీ అమ్మేస్తోందని, ఆ పార్టీ అరాచకాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.