- కొన్ని ఇండ్లకు డబుల్ నల్లా కనెక్షన్లు
- పేర్లు మూడు.. కనెక్షన్ ఒకటే
- ఫస్ట్ నుంచి నీళ్లు సరిగా వస్తలే
- బోరు నీళ్లు కలిపి సప్లయ్
- మిషన్ భగీరథ సర్వేలో వెల్లడి
యాదాద్రి, వెలుగు : మిషన్‌భగీరథపై గత సర్కారు ఎన్నో గొప్పలు చెప్పుకుంది. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. నాటి ప్రచారం అంతా ఉత్త ఢొల్లే అని తేలిపోయింది. లోకల్ బోరు వాటర్‌తో కలిపి ఇస్తున్నారని కొన్ని చోట్ల చెబుతుండగా.. కొంచెమే నీళ్లు వస్తుండడంతో లోకల్ కనెక్షన్ వాడుకుంటున్నామని మరికొన్ని చోట్ల చెబుతున్నారు. ఒక్కో ఇంటికి ఒకటి కంటే ఎక్కువగా ఇచ్చినట్టు చూపడంతోపాటు ఖాళీ స్థలాలు, కూలిన ఇండ్లకూ నల్లా కనెక్షన్లు ఇచ్చి సంఖ్యను ఎక్కువ చేసి చూపించారని తేలింది.
నీళ్లు సరిగా రావట్లే..
మిషన్‌భగీరథ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాస్తవ పరిస్థితులపై ఇటీవల సర్వే ప్రారంభించింది. సర్వేలో భాగంగా యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని గ్రామాల్లోని 1.48 లక్షల ఇండ్లల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి కుటుంబం నుంచి సభ్యుల వివరాలతోపాటు ఇంటి నంబర్, సెల్‌ఫోన్ నంబర్లతోపాటు ఆధార్‌నంబర్లు సేకరించారు. ఎక్కువ కుటుంబాల నుంచి నల్లాల నీరు మొదటి నుంచి సరిగా రావడం లేదన్న సమాధానం వచ్చినట్టుగా తెలుస్తోంది.
నల్లాల నుంచి నీరు రోజూ రావడం లేదని చెప్పిన పలువురు.. రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వస్తుందని తెలిపారు. అదేవిధంగా మిషన్‌భగీరథ కనెక్షన్ఉన్నా.. బోరు వాటరే వస్తున్నాయని తెలిపారు. కొన్నిచోట్ల మాత్రం మిషన్ భగీరథ నీరు.. బోరు వాటర్కలిపి ఇస్తున్నారని చెప్పారు. అయితే, సర్వే కోసం వచ్చిన స్టాఫ్‌కు ఇచ్చిన యాప్‌లో మాత్రం.. నల్లా ఉందా..? లేదా..? నీరు వస్తుందా.? లేదా..? అన్న ఆప్షన్ మాత్రమే ఉంది. దీంతో సర్వే స్టాఫ్వాటినే నమోదు చేసుకున్నారు. యజమాని ఫొటో, ఇంటితోపాటు నల్లా ఫొటోను కూడా తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
కనెక్షన్ ఒకటే.. లిస్టులో ఎక్కువ..
మిషన్‌భగీరథ కనెక్షన్ల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ఇవ్వాలని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఎక్కువ కనెక్షన్లు చూపాలన్న ఉద్దేశంతో కొన్ని ఇండ్లకు కనెక్షన్ఒక్కటే ఇచ్చినా.. రెండు నుంచి మూడు కనెక్షన్లు ఇచ్చినట్టుగా చూపారు. పైగా ఖాళీ ప్లాట్లు, కూలిపోయిన ఇండ్లకు సైతం కనెక్షన్లు ఇచ్చారు.
ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో కనెక్షన్ఒక్కటే ఇచ్చిన రికార్డుల్లో మాత్రం ఎక్కువ కనెక్షన్లు ఇచ్చినట్టుగా తేలింది. ఈ విధంగా కొన్ని గ్రామాల్లో మూడు నుంచి వందకు పైగా డబుల్కనెక్షన్ఇచ్చినట్టుగా తేలిపోయింది. అదేవిధంగా ఒక్కో ఇంటికి ఒకటి కంటే ఎక్కువ నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టుగా తేలింది. ఈ సర్వేలో వీటన్నింటిని స్టాఫ్నమోదు చేశారు. జిల్లాలోని 17 మండలాల్లో కలిపి దాదాపు 30 వేల కనెక్షన్లు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది.
జిల్లాలో..
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో మిషన్‌భగీరథ కోసం రూ.206.07 కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తంతో కొత్తగా 1952 కిలో మీటర్ల మేర కొత్త పైప్‌లైన్ వేశామని లెక్కలు చెబుతున్నాయి. 786 కిలో మీటర్ల మేర పాత పైపులైన్లు ఉపయోగించుకుంటున్నారు. 1,42,903 కొత్తగా నల్లా కనెక్షన్లు ఇవ్వగా, 41,436 పాత కనెక్షన్లే సరి చేశారు. 564 కొత్త వాటర్ ట్యాంకులను నిర్మించగా, 780 పాత వాటర్ ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. 66.63 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, అందులో సగం కూడా సరఫరా కావడం లేదని తెలుస్తోంది. దీంతో బోరు వాటర్‌ను మిషన్‌భగీరథతో కలిపి సరఫరా చేస్తున్నారు.