బామ్లానాయక్​ తండాలో ఎట్టకేలకు భగీరథ పనులు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా బామ్లానాయక్​ తండాలో భగీరథ పైప్ లైన్​ పనులు మొదలయ్యాయి. తాగునీరు అందించడం లేదని ఈనెల 4న గ్రామ సర్పంచ్​తో పాటు పాలకవర్గం వాటర్​ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపింది. దీంతో ఫోన్​లో మాట్లాడిన అధికారులు వారంలోపు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఈ నెల 5వ తేదీన వెలుగులో ‘కాంగ్రెస్ సర్పంచ్​అని ఊరికి భగీరథ నీళ్లిస్తలే' అనే కథనం పబ్లిష్​ అయ్యింది. దీంతో బుధవారం భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది బామ్లానాయక్ తండాకు వచ్చి పైప్​ లైన్​ పనులు ప్రారంభించారు. రెండు రోజుల్లో తండావాసులకు తాగునీరందిస్తామని చెప్పారు.

సర్పంచ్​ రాజునాయక్​ మాట్లాడుతూ తాము రెండేండ్లుగా తాగునీటి కోసం తిప్పలు పడుతున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. మిషన్​భగీరథ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపితే అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ, ఇంత తొందరగా పరిష్కరిస్తారని అనుకోలేదన్నారు.