సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు.. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, గ్రామాల్లో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఎన్ని ఇండ్లకు ఇచ్చారు.. ఎన్ని ఇండ్లకు నీళ్లు సరఫరా చేస్తున్నారు’ అని సూర్యాపేట జడ్పీ సభ్యులు ఆఫీసర్లను నిలదీశారు. గురువారం సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన జరిగిన జడ్పీ మీటింగ్ వాడీవేడిగా సాగింది. ఈ సమావేశానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమెల్యేలు గాదరి కిశోర్, సైదిరెడ్డి, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హాజరయ్యారు. మీటింగ్ ప్రారంభం కాగానే పలు సమస్యలపై సభ్యులు ఆఫీసర్లను నిలదీశారు. సమస్యలను ప్రతి సమావేశంలో చెబుతున్నా వాటిని పరిష్కరించడంలో ఆఫీసర్లు విఫలం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెల నిర్మాణం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, పైపుల లీకేజీ కారణంగా నీళ్లన్నీ పొల్లాల్లోకి వెళ్తున్నాయన్నారు. హుజూర్‌నగర్ ఎన్‌ఎస్పీ కాల్వకు గండి పడడంతో నీటిని నిలిపివేశారని దీని వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయని ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఆఫీసర్లు నిర్లక్ష్యం కారణంగా మూసీ కాల్వలోకి కొందరు వ్యక్తులు కెమికల్స్‌ను విడుదల చేస్తున్నారని, దీని వల్ల కాల్వ కింద ఉన్న భూములు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం సొంత బిల్డింగ్‌లు కట్టకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే బిల్డింగ్‌లు నిర్మించాలని కోరారు. మునగాల మండలంలోని కస్తూరిబా గాంధీ హాస్టల్‌లో రేషన్ బియ్యం వండుతున్నారని, మెనూ పాటించడం లేదని ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పార్లమెంట్ బిల్డింగ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానాన్ని ఆమోదించారు.
గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్
తెలంగాణ ప్రభుత్వం అమలు తెలుస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతోందన్నారు. జిల్లాలో పామాయిల్‌తో పాటు, అరటి తోటల పెంపకం వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధులంతా పాల్గొని సక్సెస్ చేయాలని సూచించారు.