దసరాకి డబుల్ ధమాకా

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌. శ్రీలీల కీలకపాత్ర పోషించింది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ  దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఆదివారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌‌ ఈవెంట్‌‌ను వరంగల్‌‌లో నిర్వహించారు. దర్శకులు వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్ మలినేని హాజరై సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా  రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ మాసీ లుక్‌‌లో ఆకట్టుకుంటున్నారు. ‘ష్.. సప్పుడు జెయ్యాక్’ లాంటి  పవర్‌‌‌‌ ప్యాక్డ్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఎందరో యోధులు పుట్టిన గడ్డ వరంగల్. అలాంటి ప్రాంతంలో ట్రైలర్ రిలీజ్ అవడం ఆనందంగా ఉంది. అఖండ, వీర సింహారెడ్డి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకున్నప్పుడు అనిల్ కథ చెప్పాడు. తన సినిమాల్లో ఎక్కువగా ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఉంటుంది. ఇందులో కామెడీతో పాటు ఫైట్స్, డైలాగ్స్, ఎమోషన్స్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.

ట్రైలర్‌‌‌‌లో చూసింది కొంతే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. దసరాకి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం. చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేశానంటే దానికి దర్శకులే కారణం. కాజల్ వెర్సటైల్ హీరోయిన్. శ్రీలీల అందరూ గర్వించదగ్గ నటి. అద్భుతమైన పాత్ర పోషించిన ఆమె నటన చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఆదాయం ఇచ్చే చలనచిత్ర పరిశ్రమలను గుర్తించాలని ప్రభుత్వాలను కోరుతున్నా’ అన్నారు.  కాజల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బాలయ్య సర్ డౌన్ టు ఎర్త్. ఆయనతో వర్క్ చేయడం ఇన్‌‌స్పైరింగ్‌‌గా ఉంటుంది’ అని చెప్పింది.

శ్రీలీల మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లగా కనిపిస్తా. ఇలాంటి మంచి పాత్రను ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్ అనే పదం చిన్నది అవుతుంది. ఈ కథకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. బాలకృష్ణ గారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్‌‌పీరియెన్స్’ అని చెప్పింది. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఇది నాకు మెమరబుల్‌‌ మూవీగా నిలిచిపోతుంది.

బాలకృష్ణ, శ్రీలీల మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు.   బాలయ్య అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు నిర్మాతలు.  మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.