పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం

పంజాబ్ ముఖ్యమంత్రిగా  భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ గ్రామం ఖట్కర్ కలాన్ లో ఆయన  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన పురుషులు పసుపు రంగు తలపాగాతో.. మహిళలు పసుపురంగు దుపట్టా ధరించి వచ్చారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడిన భగవంత్ మాన్.. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తానన్నారు. నిరుద్యోగుల నుంచి  రైతుల వరకు అన్నిసమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ ఎన్నికల్లో పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారని, ప్రజలు గెలిచారని అన్నారు. మంచి పాలన ఎలా అందించాలో ఆమ్ ఆద్మీకి  తెలుసని, పంజాబ్‌ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలతో ముందుకుసాగుతామని చెప్పారు. అవినీతి రహిత పాలనను అందిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని భగవంత్ మాన్ చెప్పారు.



117 అసెంబ్ల స్థానాలున్న పంజాబ్ లో.. ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. సంగ్రూర్ జిల్లాలోని ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన  భగవంత్ మాన్.. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58 వేల 206 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.