పంజాబ్ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్..? సీఎం భగవంత్ మాన్ ఏమన్నారంటే..?

పంజాబ్ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్..?  సీఎం భగవంత్ మాన్ ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓటమి పాలైంది. 11 ఏళ్లు పాటు వరుస విజయాలు సాధించుకుంటూ వస్తోన్న ఆప్‎కు ఈ సారి ఢిల్లీ ఓటర్లు షాకిచ్చి బీజేపీకి పట్టం కట్టారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీ 48 స్థానాల్లో గెలుపొంది 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 22 సీట్లకే చాప చుట్టేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలవడం ఒక ఎత్తైతే.. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలుకావడం మరో ఎత్తు. ఢిల్లీలో ఆప్ ఓడిపోయిన వెంటనే కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది. పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు రాజౌరి గార్డెన్ నుండి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా కూడా సేమ్ ఇలాంటి కామెంట్సే చేశారు

‘‘ఢిల్లీలో ఆప్ ఓటమితో కేజ్రీవాల్ పంజాబ్ సీఎం సీటుపై కన్నేశారు. సీఎం భగవంత్ మాన్‎ను ఓ అసమర్థ నాయకుడిగా ముద్ర వేసి పక్కకు తొలగించాలని ప్లాన్ జరుగుతోంది. పంజాబ్ మహిళలకు రూ.1,000 ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, పంజాబ్‎లో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో మాన్ ఫెయిల్ అయ్యారని అతడిపై నిందలు మోపి తొలగిస్తారు. అందుకే ఢిల్లీలో ఆప్ ఓటమి పాలైన వెంటనే.. పంజాబ్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీలో కేజ్రీవాల్ అయితేనే  పంజాబ్‎ను సమర్థవంతంగా నడిపించగలరని ఆప్ ఎమ్మెల్యేల చేత చెప్పించి.. మాన్‎ను సీఎం పదవి నుంచి తొలగించాలని కేజ్రీవాల్ ప్లాన్ చేశారు’’ అని మంజీందర్ సింగ్ సిర్సా సంచలన ఆరోపణలు చేశారు. 

ఈ ఊహాగానాల నడుమ మంగళవారం (ఫిబ్రవరి 11) ఢిల్లీలోని కపుర్తల హౌస్‎లో పంజాబ్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆప్ సీనియర్ నేతలు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పంజాబ్‎లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భగవంత్ మాన్ ప్రభుత్వ పని తీరుపై ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ చర్చించారు. అలాగే.. ఆప్‎ పంజాబ్ యూనిట్లో చీలిక ఏర్పడబోతుందని జరుగుతున్న  ప్రచారంపైన ఈ భేటీలో డిస్కస్ చేసినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం సీఎం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు.. కేజ్రీవాల్ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారా..? అని మాన్‎ను ప్రశ్నించారు.

ALSO READ | కేజ్రీవాల్ ఓటమి ఆతిశీకి సంతోషం: అనురాగ్ ఠాకూర్

దీనికి స్పందించిన భగవంత్ మాన్.. స్మైల్ ఇస్తూ అలాంటిదేమి లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ.. వాళ్లను ఎన్నైనా చెప్పనివ్వండి అంటూ కేజ్రీవాల్ సీఎం ప్రచారాన్ని తోసిపుచ్చారు. పంజాబ్‌లోని 20 మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలకు కూడా సీఎం మాన్ కౌంటర్ ఇచ్చారు. ప్రతాప్ బజ్వా దాదాపు మూడు సంవత్సరాలుగా ఇదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆప్ ఎమ్మెల్యేల గురించి కాకుండా.. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్యను ఒకసారి లెక్కించుకోండని సెటైర్ వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించని విషయం తెలిసిందే.