ఉద్యమాల తొలిగురువు భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి

ఉద్యమాల తొలిగురువు భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి
  • భాగ్యనగరం ముద్దుబిడ్డ భాగ్యరెడ్డి వర్మ .. 
  • ఫిబ్రవరి 18న భాగ్యరెడ్డి వర్మ 86వ వర్ధంతి

దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరం నడిబొడ్డున  జన్మించిన ధృవతార,  సామాజిక ఉద్యమాలకు తొలి గురువు మాదరి భాగ్యరెడ్డి వర్మ.  నిజాం స్టేట్  హైదరాబాద్ సంస్థానంలో  ఆత్మగౌరవ పోరుకు తొలిపొద్దుగా నిలిచిన  భాగ్యరెడ్డి వర్మ గురించి,  ఆయన చేసిన త్యాగాలు పోరాటాల గురించి  ఎంత చెప్పినా తక్కువే.  

హైదరాబాద్​ సుల్తాన్ బజార్​లో నివాసముంటున్న  సాధారణ  దళిత మాల కులం కుటుంబంలోని  మాదరి  వెంకటయ్య, రంగమాంబ దంపతులకు  భాగయ్య 22 మే 1888న  జన్మించారు.  తండ్రి  వెంకటయ్య  భాగయ్య  చిన్నతనంలో చనిపోవడంతో  కుటుంబ భారం కుమారుడు భాగయ్యపై  పడింది.  స్థానికంగా పనులు చేస్తూనే  రాత్రి  సమయంలో శ్రీకృష్ణాంధ్ర  తెలుగు భాష నిలయం వారి సహకారంతో చదువులు నేర్చుకున్నారు.  

యుక్త వయసులో  సుల్తాన్ బజార్​లో ఉన్న ఆర్య సమాజ్​లో  పని చేశారు. ఆర్య సమాజ్ నిర్వాహకులు  బాజీ కిషన్ రావు  భాగయ్య సేవలు గుర్తించి వర్మగా  బిరుదునిచ్చారు. కుల వ్యవస్థకు  పెద్దపీట వేస్తున్న ఆనాటి  సమాజం  రెడ్డి కులాలకు కింది స్థాయి కులాలు ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలన దక్షుడిగా గౌరవం ఉంటుందని,  వారి కన్నా తమ జాతులు తక్కువ కాదని, తన పేరులో రెడ్డిని  చేర్చుకున్నాడు.  దీనితో  మాదరి భాగయ్య పేరు  మాదరి భాగ్యరెడ్డి వర్మగా మారింది.

దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం

హిందూ సమాజంలో  కింద కులాలతో ఆచారాలు వ్యవహారాలతో  వెట్టి సేవలు చేయించుకుంటున్నారని  ఆయన తిరుగుబాటు చేశారు.   అణగారిన వర్గాలవారిని  చైతన్యం చేస్తూ మద్యపాన నిషేధం , దేవాదాసీ  వ్యవస్థ,  కుల నిర్మూలన  కోసం పాటుపడ్డాడు.  

1911లో  ఆది హిందూ సోషల్ లీగ్  అనే సంస్థను ఏర్పాటు చేసి  అంతరాలు తొలగించడానికి  సహబంతి భోజనాలు ఏర్పాటు చేశారు.  భాగ్యరెడ్డి వర్మ  చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు సంఘ సేవకులైన  మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి,  బాలా ముకుందరాయ్,  కృష్ణ స్వామి ముదిరాజ్ మద్దతునిచ్చారు.   

అంబేద్కర్​తో  పరిచయం  

1917లో  భాగ్యరెడ్డి వర్మ  విజయవాడలో నిర్వహించిన సమావేశం  దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమకారులందరినీ ఆకర్షించింది.  బాబా సాహెబ్   డాక్టర్  బీఆర్ అంబేద్కర్  ఆంధ్రప్రదేశ్​లో  బీవీ రమణయ్య, కుసుమ ధర్మన్న,  గుర్రం జాషువా,  తమిళనాడులో  పెరియార్ రామస్వామి,   కేరళలో  నారాయణ గురు,  వీరితోపాటు  బెంగాల్,  మహారాష్ట్ర  ప్రాంతంలో  జరిగే సభలు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 

1929లో బొంబాయిలో జరిగిన  ఆల్ ఇండియా  డిప్రెసెడ్ క్లాసెస్  ఆర్గనైజేషన్  సమావేశంలో  డాక్టర్  బీఆర్ అంబేద్కర్  ఆహ్వానం మేరకు పాల్గొని  సమావేశానికి  అధ్యక్షత వహించారు.  అదే సమావేశంలో  లండన్​లో  రౌండ్ టేబుల్ సమావేశానికి  దళితుల ప్రతినిధిగా  అంబేద్కర్  వెళ్లాలని  భాగ్యరెడ్డి వర్మ  ప్రతిపాదించారు.  

1931లో  జరిగిన  జనాభా లెక్కల సేకరణలో దళితులను ఆది హిందువులుగా  నమోదు చెయ్యాలని  భాగ్యరెడ్డి వర్మ  నిజాం ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థులను స్వీకరించిన  నిజాం ప్రభుత్వం జనాభా లెక్కల్లో  దళితులు అణగారిన వర్గాలను  ఆది హిందువులుగా గుర్తించి  నిజాం  ప్రభుత్వం సర్టిఫికెట్లను జారీ చేసింది.  దీనితో పక్క రాష్ట్రాలైన  ఉమ్మడి మద్రాస్ ఆంధ్రప్రదేశ్  ఆది ఆంధ్ర,  ఆది ద్రవిడ,  కర్నాటకలో  ఆది కన్నడ అనే పేరుతో  ఆ రాష్ట్రాల్లో దళితులు సర్టిఫికెట్లు పొందారు.

ఆది హిందూ భవన్ నిర్మాణం 

దేశానికి  స్వాతంత్ర్యం రాకముందు నిజాం పరిపాలనలో  సుల్తాన్ బజార్  ప్రస్తుత  కోఠిలో  పరిసర  ప్రాంతాలలో  కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని,  వారికోసం భవనాలు నిర్మించుకొని..  వారి వారి కులంలోని విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించడం కోసం  కళాశాలలు, హాస్టళ్లు  ఏర్పాటు చేశారు. 

అందులో భాగంగానే  గౌడ సంఘం హాస్టల్,  సగర కమ్యూనిటీ,  పద్మశాలి కమ్యూనిటీ,  మున్నూరు కాపు సంఘం,  వాసవి హాస్టల్ వచ్చాయి. వారితో సమానంగా  తమ జాతి జనుల కోసం కూడా  సామూహిక భవనం  నిర్మించ తలపెట్టారు. అందులో  భాగంగానే 1931లో ఆది  హిందూ భవన నిర్మాణానికి పునాది రాయి వేశారు.  విరాళాలతోటే  ఆది హిందూ భవన్​ నిర్మించారు.  ప్రస్తుతం  చాదర్​ఘాట్​ బ్రిడ్జి వద్ద ఉన్న ఆది  హిందూ భవన్  దేశంలోనే  దళితుల తొలి భవన్​గా  పేరుపొంది పేదలు,  దళిత వర్గాలకు ఆత్మగౌరవానికి సాక్షిగా నిలిచింది.

భాగ్యోదయం  పత్రిక నిర్వహణ

సామాజిక ఉద్యమాలు చేస్తూనే  తమ అణగారిన వర్గాల జాతిజనుల చైతన్యం కోసం  భాగ్యోదయమనే  మాస పత్రికను ప్రారంభించారు. ముద్రించిన  పత్రికలను  ఆది హిందూ సోషల్ ద్వారా  బస్తీలవారీగా పంపిణీ చేసి  ప్రతి నెలా జరిగే సమావేశాల్లో  అందులోని అంశాలను ప్రతివారికి వివరించేవారు. 

సమాజంలో అణగారిన వర్గాలైన  దళితుల్లోని మాలలు, మాదిగలు అగ్రవర్ణాల వారికి  సేవల పేరు మీద  చేస్తున్న వెట్టి గమనించి. దానిపైన  వెట్టి మాదిగ  అనే గ్రంథాన్ని రాశారు. అదికులవృత్తుల్లో  జరుగుతున్న అన్యాయాలను  సమాజం దృష్టికి తీసుకువచ్చిన  తొలి దళిత గ్రంథంగా నిలిచింది.   

నేటి తరానికి ఆదర్శ సంఘ సంస్కర్త

అణగారిన వర్గాల ఆత్మస్థైర్యం కోసం  నిరంతరం పోరాడుతూనే  హైదరాబాద్​లో ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  కుల వివక్షతను దృష్టిలో పెట్టుకొని  బౌద్ధమతం స్వీకరించాలని  నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే దేశంలో అంబేద్కర్  కంటే ముందే  బుద్ధ పూర్ణిమ రోజు  1915లో  బౌద్ధమతం స్వీకరించారు.  

ఆయన క్షయవ్యాధితో  బాధపడుతూ వచ్చారు. పూర్తిస్థాయిలో కోలుకోకముందే  18  ఫిబ్రవరి 1939 న   51 సంవత్సరాల వయసులో  తుది శ్వాస వదిలారు.  అణగారిన జాతుల కోసం పోరాటం చేస్తున్న దళిత శిఖరం నేలకొరిగింది. భాగ్యరెడ్డివర్మ చేసిన సేవలను  తెలంగాణ ప్రభుత్వం గుర్తించి జయంతి,  వర్ధంతులను  అధికారికంగా నిర్వహిస్తోంది. దీనితోపాటు ఆయన జీవిత చరిత్రను  తెలుగు పాఠ్యాంశంలో కూడా చేర్చింది. 

- అస శ్రీరాములు, సీనియర్ జర్నలిస్ట్ -