భైంసా బంద్​ ప్రశాంతం

భైంసా బంద్​ ప్రశాంతం
  • నాగదేవత ఆలయంలో చోరీ చేసినవారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్​
  • ఏఎస్పీకి వినతి పత్రం అందజేసిన హిందూ సంఘాల ప్రతినిధులు

భైంసా, వెలుగు: హిందూ ఆలయాల్లో తరచూ చోటుచేసుకుంటున్న దొంగతనాల ఘటనలను నిరసిస్తూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన భైంసా బంద్​ప్రశాంతంగా ముగిసింది. ఒక వర్గానికి చెందిన వ్యాపార, వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బంద్​ కారణంగా నిత్యం క్రయ, విక్రయాలతో సందడిగా కనిపించే రోడ్లు బోసిపోయి కనిపించాయి. పోలీసులు బందోబస్తు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు.

చోరీల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. దొంగలను పట్టుకోవడంలో పోలీసు శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం ఏఎస్పీ అవినాశ్ కుమార్​కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. నాగదేవత గుడిలో చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, క్లూస్​టీం సేకరించిన ఆధారాలతో అనుమానితులను గుర్తించినట్లు ఏఎస్పీ తెలిపారు.  

నాగదేవత ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

చోరీ జరిగిన నాగదేవత ఆలయాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్​బుధవారం పరిశీలించారు. ఆలయ నిర్వాహకులతో మాట్లాడి ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగలను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, సుష్మారెడ్డి, శంకర్​ తదితరులున్నారు.