ఒకరు మొక్కలే కొడుకులనుకున్నారు. ఊళ్లోని బంజరు భూమిని పచ్చని పరుపు చేశారు. ఇంకా చేతనైనంత చేస్తానంటున్నారు. ఇంకొకరు మిగిలిన జీవితాన్ని మొక్కలతోనే గడపాలనుకున్నారు. వస్తున్న పెన్షన్ డబ్బుతో మొక్కలకు ప్రాణం పోస్తున్నారు. అందులోనే సంతృప్తిని వెతుక్కుంటున్నారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరూ పచ్చదనం కోసం పరితపిస్తున్నారు.
ఊళ్లోని 123 ఎకరాలను అడవి చేసిన భయ్యారామ్
పచ్చని పరుపైపోయిన మధ్యప్రదేశ్‌లోని భరత్‌పూర్
టీచర్‌గా రిటైరయ్యాక మొక్కలతోనే గడుపుతున్న తయమ్మల్
తమిళనాడు తిరుపూర్‌లో 8 ఎకరాల్లో చెట్ల పెంపకం
భార్యను పోగొట్టుకున్నడు. కొన్నేళ్లకు కొడుకునూ కోల్పోయిండు. పిచ్చోడై రోడ్లపొంటి తిరిగిండు. కానీ ఒక్క‘నినాదం’తో మారిపోయిండు. ఊరికొచ్చిండు. చెట్లు పెంచడం మొదలు పెట్టిండు. 123 ఎకరాల పడావు భూమిని అడవిగా మార్చి పచ్చని పరుపులా మార్చేసిండు. అందరికీ స్ఫూర్తిగా నిలిచిండు. అతడే భయ్యారామ్ యాదవ్.
మధ్యప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లా భరత్‌పూర్. అక్కడో రైతు భయ్యారామ్ యాదవ్. ఇప్పుడు 55 ఏళ్లు. 2001లో కాన్పు సమయంలో ఆయన భార్య చనిపోయింది. ఏడేళ్ల తర్వాత కొడుకూ సరైన వైద్యం అందక మృతి చెందాడు. దీంతో భయ్యారామ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇంటిని వదిలేశాడు. పిచ్చోడిలా చిత్రకూట్‌లో రోడ్లపై తిరిగాడు. అలా తిరుగుతున్న టైంలోనే ఫారెస్టు డిపార్ట్‌మెంట్ వారి ఓ నినాదాన్ని చూశాడు. ‘ఒక్క చెట్టు వంద మంది కొడుకులకు సమానం’ స్లోగన్‌తో ఆలోచనలో పడ్డాడు. ఇంటికొచ్చేశాడు. ఊరి బయట ఓ గుడిసె వేసుకున్నాడు. మొక్కలు నాటడం స్టార్ట్ చేశాడు. తొలుత గ్రామస్థులు తనను పిచ్చోడిలా చూశారు. తర్వాత ఆయన లక్ష్యానికి మురిసిపోయారు. సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 40 మొక్కలతో మొదలైన ప్రస్థానం ఇప్పుడు 40 వేలకు చేరింది. భయ్యారామ్ శ్రమతో భరత్‌పూర్ ఊరు పచ్చని పరుపైపోయింది. 123 ఎకరాల బంజరు భూమి అడవైపోయింది. భయ్యారామ్ ఒకేరకం కాకుండా రకరకాల మొక్కలు నాటాడు. ఇప్పుడు 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోడానికి ఓ సాయం అడుగుతున్నాడు. తన ప్రాంతంలో ఓ చేతి పంపు కావాలని కోరుతున్నాడు. ఒకప్పుడు పిచ్చోడన్న చిత్రకూట్ ప్రజలు ఇప్పుడు ఆయన ఇన్‌స్పిరేషన్ అంటున్నారు. ఇంతకీ ఈయన గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందనుకుంటున్నారు. ఈయన స్టోరీని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేయడంతో.
దేవుడు నా ఒక్క కొడుకును తీసుకుపోవచ్చు. ఇప్పుడు నేను వేలాది మొక్కలకు తండ్రిని – భయ్యారామ్
ఆమె టీచర్‌గా పని చేసి రిటైరైంది. ఆత్మ సంతృప్తినిచ్చే పని కోసం వెతకడం మొదలు పెట్టింది. ఉన్న కొద్దిపాటి స్థలంలో మొక్కలను పెంచడం మొదలు పెట్టింది. వచ్చే పెన్షన్ డబ్బులనూ మొక్కలకే ఖర్చు పెట్టింది. అలా 8 ఎకరాలను పచ్చటి పందిరిలా మార్చింది. మరంగలిన్ తయాయర్ (మదర్ ఆఫ్ ట్రీస్) అయ్యింది. ఆమె తయమ్మల్.
ప్రస్తుతం చెట్లను చూసుకోడానికి ఒకరిని పనిలో పెట్టుకున్నాం. పని ఎక్కువగా ఉండేరోజుల్లో ఎక్కువ మందిని పనికి పిలుస్తాం. ఇప్పటివరకు సుమారు 4 లక్షలు మొక్కల కోసం ఖర్చుపెట్టా – తయమ్మల్
తమిళనాడు రాష్ట్రం తిరుపూర్. 75 ఏళ్ల తయమ్మల్. 37 ఏళ్లపాటు 8వ తరగతి వరకు జాగ్రఫీ, హిస్టరీ, మ్యాథ్స్ చెప్పారు. టీచర్‌గా రిటైర్ అయ్యారు. ఇంట్లో కాస్త టైం మిగులుతోంది. ఏ పనైనా చేద్దామనుకున్నారు. ఆత్మ సంతృప్తినిచ్చే పని కోసం వెతికారు. ఆలోచించారు. మొక్కలు పెంచడం బాగా నచ్చింది. టీచర్‌గా ఉన్నప్పుడే తనకున్న కొద్ది స్థలంలో కొబ్బరి చెట్లు పెంచిన అనుభవముంది. రిటైర్ అయ్యాక టైం బాగా కలిసొచ్చింది. వచ్చే పెన్షన్ డబ్బుతో చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. తొలుత చాలా మంది నిరుత్సాహపరిచారు. వ్యవసాయం, మొక్కలు పెంచడంపై డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావని తోటి టీచర్లు, గ్రామస్థులు చెప్పారు. కానీ అవేవీ తను వినలేదు. తన పనికి భర్త నారాయణ స్వామి కూడా సపోర్ట్ చేశారు. చెట్లు పెంచడానికి తయమ్మల్ చాలానే కష్టపడ్డారు. భూమిని తనకు తాను నిర్వహించుకోవడానికి వ్యవసాయం, భూమి రకాలకు సంబంధించిన పుస్తకాలు బాగా చదివారు. అలా 8 ఎకరాల్లో ప్రస్తుతం రకరకాల మొక్కలు, చెట్లు పెంచుతున్నారు. మూడు, నాలుగు రోజులకోసారి మొక్కలున్న ప్రాంతానికి తయమ్మల్ వెళ్తుంటారు. పంటకాలంలో రోజూ వెళ్లొస్తారు. వనథుకుల్ తిరుపూర్ ఎన్జీవోలో తయమ్మల్ మెంబర్. తిరుపూర్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. పరిశ్రమలు బాగా పెరిగాయి. కాలుష్యం పెరగకుండా ఈ ప్రాంతంలో చెట్లు నాటాలని ఈ ఎన్జీవో కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఖాళీ ప్లాట్ల యజమానుల నుంచి పర్మిషన్ తీసుకొని మొక్కలు నాటుతుంటుంది.