భక్షికుంట, రేగుల కుంట చెరువుల పరిశీలన

హైదరాబాద్ సిటీ, వెలుగు: చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ సోమవారం విజిట్​చేశారు. తక్కువ నిధులతో రెండు చెరువులను అభివృద్ధి చేసిన తీరును లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు. చెరువుల్లోకి మురుగు చేరకుండా చేపట్టిన చర్యలను కమిషనర్ పరిశీలించారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ ఎస్టీపీ ద్వారా మురుగును శుద్ధి చేసి కాల్వల్లోకి మళ్లిస్తున్న విధానంపై ఆరా తీశారు. రేగులకుంట చెరువులోని నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. 

 ప్రజావసరాలకు కేటాయించిన స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని కోరారు. రేగులకుంట, భక్షికుంట మాదిరిగా సిటీలోని 10 చెరువులను అభివృద్ధి చేస్తామని కమిషనర్ తెలిపారు. అలాగే పీసీబీ ఆఫీసులో పీసీబీ మెంబర్​సెక్రటరీ జి.రవితో కమిషనర్​రంగనాథ్​సమావేశమయ్యారు. చెరువుల్లోకి మురుగు, వరద నీటి కాల్వల్లోకి పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యం రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పీసీబీ మెంబర్​సెక్రటరీ రవి మాట్లాడుతూ చెరువుల పరిరక్షణకు హైడ్రా, పీసీబీ సంయుక్తంగా పనిచేస్తాయన్నారు.