బనకచర్ల నీళ్ల కుట్ర..ఎస్ఆర్ బీసీ లైనింగ్ పనులతో తెలంగాణ నీటి వాటా దోపిడి

బనకచర్ల నీళ్ల కుట్ర..ఎస్ఆర్ బీసీ లైనింగ్ పనులతో తెలంగాణ నీటి వాటా దోపిడి

గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్​ రెగ్యులేటర్​కు తరలిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కారు..  ఆ సాకుతో పెన్నా బేసిన్​కు ఆయువుపట్టుగా ఉన్న బనకచర్ల హెడ్​ రెగ్యులేటర్​ సామర్థ్యాన్ని మరింత విస్తరించే కుట్ర పన్నుతున్నది. ఇందుకోసం 2005లో పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలోనే  బనకచర్ల విస్తరణకూ ఇచ్చిన జీవో 305 దుమ్ముదులుపుతున్నది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని బనకచర్ల హెడ్​రెగ్యులేటర్​ కెపాసిటీని పెంచడంతోపాటు అక్కడి నుంచి ప్రారంభమయ్యే కెనాల్స్ విస్తరణ, లైనింగ్​ పనులకు రెడీ అవుతున్నది. 

ఎస్ఆర్​బీసీకి లైనింగ్

పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటిని తీసుకొచ్చే శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్(ఎస్​ఆర్​ఎంసీ)​ లైనింగ్​ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  ఆ పనులు పూర్తయితే 90 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఈ కెనాల్​సామర్థ్యం కాస్తా లక్షన్నర క్యూసెక్కులకు పెరుగుతుంది. అందుకు తగ్గట్టు బనకచర్ల రెగ్యులేటర్ ను విస్తరించడంతోపాటు దిగువన ఉన్న శ్రీశైలం  రైట్ బ్రాంచ్​  కెనాల్, కేసీ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్, తెలుగు గంగ కాల్వల కెపాసిటీని కూడా పెంచాలని ఏపీ భావిస్తున్నది. ఉదాహరణకు శ్రీశైలం రైట్​ బ్రాంచ్​ కెనాల్​ (ఎస్ఆర్ బీసీ) కెపాసిటీ11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని సామర్థ్యాన్ని పెంచాలని సీమ నేతల నుంచి చాలా ఏండ్లుగా డిమాండ్లు ఉన్నాయి. దీంతో ఎస్ఆర్​బీసీ లైనింగ్​పనులు చేపట్టనున్నట్టు 2015లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

నాడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు జీబీ లింక్​ను ముంగటేసుకున్న ఏపీ సర్కార్​..  ఎస్ఆర్​బీసీ లైనింగ్​కు సంబంధించి పాత ఫైలు దుమ్ము దులుపుతున్నది. ఈ లైనింగ్​ పనులు పూర్తయితే కాల్వ కెపాసిటీ 22 వేల క్యూసెక్కులకు పెరుగుతుంది. అంటే ఎస్ఆర్​బీసీ ద్వారా ప్రస్తుతం రోజుకు ఒక టీఎంసీ తీసుకెళ్తుండగా, ఇకపై 2  టీఎంసీలు తీసుకెళ్తారన్నమాట! ఇలాగే మిగిలిన 3 కాల్వల విస్తీర్ణం పెంచడంతోపాటు లైనింగ్​ పనులు పూర్తిచేసి ప్రతిరోజూ 18 టీఎంసీల వాటర్​ను తరలించే కెనాల్​ సిస్టమ్​ను ఏపీ సర్కారు రాబోయే రోజుల్లో సిద్ధం చేసి పెట్టుకోబోతున్నది. ప్రస్తుతం దొంగతనంగా ఈ నీటిని ఎత్తుకెళ్తున్న ఏపీ, ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ, ఆయకట్టు రెడీ చేసిపెట్టుకున్నాక ఆ నీళ్లన్నీ తన హక్కుగా రావాల్సినవని ట్రిబ్యునల్స్​లో కొట్లాడే అవకాశం ఉంటుందని తెలంగాణ ఇరిగేషన్​ ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు. పరిస్థితి అంత దూరం రాకముందే ఏపీ సర్కారు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు.