- తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకం
హైదరాబాద్ సిటీ, వెలుగు: పార్టీలు, భావజాలాలు ఏవైనా కలిసి పని చేద్దామనే మనస్తత్వం ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక విషయాల్లో మార్గదర్శకం చేశాడని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ కింగ్ కోఠీలోని భారతీయ విద్యా భవన్లో దిలీప్ కుమార్ రచించిన ‘తెలంగాణ ఉద్యమంలో కొన్ని ముఖ్య ఘట్టాలు’ పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించగా, ‘అన్ రిటన్ పేజస్ ఇన్ హిస్టారిక్ తెలంగాణ స్ట్రగుల్’ ఇంగ్లీష్ పుస్తకాన్ని రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ మలూక్ నగర్ ఆవిష్కరించారు.
దిలీప్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడని దత్తాత్రేయ గుర్తుచేశారు. దిలీప్ చరిత్రే తెలంగాణ చరిత్ర అని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కొనియాడారు. దిలీప్ పుస్తకం చదువుతుంటే 50వ దశకంలో తెలంగాణ మన కండ్ల ముందు నడుస్తున్న అనుభూతి కలుగుతుందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ రియాజ్ అన్నారు. ఈ పుస్తకంపై సమీక్ష చేయడంతో పాటు అన్ని లైబ్రరీల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, విమలక్క, పీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకట స్వామి, దైవజ్ఞ శర్మ, జయ వింధ్యాల, మధు సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.