
- భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సైన్స్గురించి సరళమైన భాషలో ఆలోచిస్తే ఉత్తమ ఆవిష్కరణలు కనుగొనవచ్చని పద్మభూషణ్అవార్డు గ్రహీత, భారత్బయోటెక్వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్వర్సిటీలో శుక్రవారం సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గీతం నెలకొల్పిన మల్టీడిసిప్లీనరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ఆన్ ట్రాన్సేషనల్ పరిశోధనా కేంద్రాన్ని గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ మతుకుమిల్లి, చాన్స్లర్ వీరేందర్ సింగ్ చౌహాన్తో కలిసి ఎల్లా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశం12 నుంచి15 శాతం జీడీపీ వృద్ధిని సాధించాలంటే అది సైన్స్ఆవిష్కరణలతోనే సాధ్యమన్నారు. అందుబాటులో ఉన్న శాస్ర్తీయ జ్ఞాన సంపదను గుర్తించి, సైన్స్ ప్రాథమిక సూత్రాలను స్వీకరించాలని యువ పరిశోధకులకు సూచించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన భారత్ బయోటెక్ ప్రయాణం ప్రస్తుతం నాలుగు వేల మందితో ఐదు ప్రదేశాలకు విస్తరించిందని వివరించారు. క్లినికల్ పరిశోధనలతోనే వాక్సిన్ను ఆవిష్కరించ గలిగామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ పూర్వ డైరెక్టర్ చంద్రశేఖర్, వివిధ సంస్థల పరిశోధనా ప్రతినిధులు పాల్గొన్నారు.