- సికింద్రాబాద్‌లో రైలు ప్రారంభించిన అధికారులు
- గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రాల సందర్శన
- పది రోజుల పాటు కొనసాగనున్న యాత్ర
హైదరాబాద్, వెలుగు: ‘మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర’పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఈ రైలులో ప్రయాణిస్తున్న డాక్టర్ టి.విట్టల్ రెడ్డి (77 ఏండ్ల), టి.కుసుమ (68 ఏండ్లు), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గ్రూప్ జనరల్ మేనేజర్ పి.రాజ్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని దివ్య తీర్థస్థలాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. బుధవారం నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనున్నది.
రామజన్మభూమి (అయోధ్య ), జ్యోతిర్లింగాలలో ఒకటైన (కాశీ విశ్వనాథ్ ఆలయం) సందర్శించనున్నారు. గయలో పిండ్ ప్రదానం (పూర్వీకులకు నివాళి అర్పించడం) చేయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నది. సికింద్రాబాద్‌తో పాటు భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, ఏపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, వైజాగ్ (పెందుర్తి), విజయనగరం మార్గం మధ్యంలో ఇరువైపులా ప్రయాణికులు రైలు ఎక్కి, దిగే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు
మరో కొత్త పర్యాటక ప్యాకేజీ
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ప్రయాణించేందుకు మరో కొత్త పర్యాటక ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ త్రివేణి సంగమం, వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి, అయోధ్యలోని రామజన్మ భూమి, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ యాత్ర 8 రోజులు సాగనున్నది.
ఇందులో వసతి, క్యాటరింగ్‌తో పాటు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ http://www.irctctourism.comను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు సికింద్రాబాద్ ఆఫీస్‌లోని 040 -27702407, 97013 60701, 92814 95845, 92814 95843, 82879 32228, 92810 30740, 9281030712 నంబర్లను సంప్రదించవచ్చు.