ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

కూసుమంచి, వెలుగు:ఏఐసీసీ అగ్ర నేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్రకు సంఘీభావంగా గురువారం మండల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పాలేరు వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను కాంగ్రెస్​ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవిరెడ్డి ప్రారంభించారు. పార్టీ లీడర్లు మట్టె గురవయ్య, కలీం, నాగేశ్వరరావు, అంజయ్య, ఉల్లోజ్​ తిరుమలేష్, భూపాల్​రెడ్డి పాల్గొన్నారు.  

ముగిసిన యాత్ర
కల్లూరు: తల్లాడ నుంచి  కల్లూరు వరకు చేపట్టిన పాదయాత్ర ముగిసింది. బ్లాక్  కాంగ్రెస్ అధ్యక్షుడు దగ్గుల  రఘుపతిరెడ్డి, పార్టీ లీడర్లు కాపా సుధాకర్, పెద్దబోయిన దుర్గాప్రసాద్, బైరెడ్డి మనోహర్ రెడ్డి, కొండూరు కిరణ్, జిల్లెల్ల కృష్ణారెడ్డి, తోట జనార్ధన్, దారా రంగ, షేక్ అఫ్రోజ్, తెళ్లూరి చుక్క, సత్యనారాయణ, పుల్లారావు పాల్గొన్నారు.

దేశ సమగ్రత కోసమే.. 
ఖమ్మం రూరల్: దేశ సమగ్రత కోసంమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని కాంగ్రెస్​ నాయకులు రాయల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి నుంచి తిరుమలాయపాలెం వరకు 12 కిలోమీటర్లు పాదయాత్ర  నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, లీడర్లు కళ్లెం వెంకటరెడ్డి, మొక్క శేఖర్ గౌడ్, ఆరెంపుల రామయ్య, కన్నేటి వెంకన్న, గోనె భుజంగ రెడ్డి, కేతినేని వేణు, ఇతగాని అంజయ్య, కందిమళ్ల  వెంకటనారాయణ పాల్గొన్నారు.

మూడేళ్ల క్రితమే నువ్వు చనిపోయావ్

సుజాతనగర్, వెలుగు: ఆఫీసర్ల తప్పిదంతో వికలాంగురాలైన వృద్ధురాలు ప్రభుత్వ రికార్డులో చనిపోయినట్లు నమోదైంది. మండలంలోని నాయకులగూడెం గ్రామానికి చెందిన దండు సీతమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ తీసుకొని వికలాంగుల పెన్షన్ కోసం 
దరఖాస్తు చేసుకుంది. సుజాతనగర్  ఎంపీడీవో ఆఫీస్​ నుంచి పెన్షన్ మంజూరైనట్లు లెటర్  కూడా తీసుకుంది. ఒక నెల పెన్షన్  మంజూరైందని చెప్పడంతో బ్యాంకు చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి డబ్బులు రాలేదని పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు మొరపెట్టుకుంటూ వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే కొత్త పెన్షన్​ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కొడుకుతో కలిసి వచ్చి తనకు పెన్షన్  ఎందుకు రావడం లేదో చూడాలని గట్టిగా అడిగింది. ఆఫీసర్లు రికార్డులు పరిశీలించి మూడేళ్ల క్రితమే నువ్వు చనిపోయావని చెప్పారు. మీ ముందే ఉన్న కదా సారూ.. నన్ను చనిపోయావని అంటారేమని అడిగితే తమకు తెలీదు నువ్వు బతికే ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకో అని చెప్పడంతో బోరున విలపిస్తోంది. జిల్లా ఆఫీసర్లు తనకు మూడేళ్ల కింద మంజూరైన పెన్షన్ ఇప్పించాలని కోరుతోంది. 

కుళ్లిన కూరగాయలతో భోజనం ఎలా పెడుతున్రు
 కాంట్రాక్టర్​పై డీ‌‌ఈ‌‌వో సోమశేఖర శర్మ ఫైర్

జూలూరుపాడు, వెలుగు: మండల కేంద్రంలోని కేజీబీవీలో కుళ్లిపోయిన కూరగాయలను చూసి డీఈవో సోమశేఖర శర్మ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్కూల్ ను విజిట్ చేసిన ఆయన కుళ్లిన కూరగాయలతో స్టూడెంట్ కు భోజనం ఎలా పెడుతున్నారని, ఇలాంటి కూరగాయలతో భోజనం పెడితే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని  అసహనం వ్యక్తం చేశారు. కూరగాయలు సప్లై చేసే కాంట్రాక్టర్ కు ఫోన్  చేసి వాటిని వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు. మరోసారి ఇలా జరిగితే కాంట్రాక్ట్  రద్దు చేస్తానని హెచ్చరించారు. అనంతరం క్లాస్ రూమ్​ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కేజీబీవీలను విజిట్ చేస్తున్నట్లు తెలిపారు. తన సొంత నిధుల నుంచి కలెక్టర్​ స్కూల్ కు రూ.50 వేల చొప్పున నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఎస్‌‌ వో పద్మజ, టీచర్లు పాల్గొన్నారు.

మహిళా మావోయిస్టుల అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్​ చర్ల ఏరియా కమిటీ మెంబర్​ మడకం కోసి అలియాస్​ రజితతో పాటు దళ సభ్యురాలు మడవి ధని అలియాస్​ లచ్చులను అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ డాక్టర్​ వినీత్​ తెలిపారు. ఎస్పీ ఆఫీస్​లో గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కుర్నపల్లి, బోదనెల్లి మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు​సంచరిస్తున్నారనే సమాచారంతో బుధవారం కూంబింగ్​ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వారిని పట్టుకునేందుకు యత్నించినట్లు చెప్పారు. చర్ల ఏరియా కమిటీ మెంబర్​ కోసి, దళ సభ్యురాలు ధని పట్టుబడ్డారని తెలిపారు. వారి నుంచి 20 జిలిటెన్​ స్టిక్స్, 2 డిటోనేటర్స్, వైర్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులను హత్య చేసేందుకు ల్యాండ్​ మైన్స్​ ఏర్పాటు చేసేందుకు చత్తీస్​ఘడ్​ నుంచి వచ్చినట్లు చెప్పారు. 81 ఘటనలలో ప్రమేయం ఉన్న రజిత మావోయిస్ట్​నేత దామోదర్​భార్య అని తెలిపారు. ఏఎస్పీ రోహిత్ రాజు, ఓఎస్డీ టి. సాయిమనోహర్, సీఐ అశోక్​ పాల్గొన్నారు. 

‘మన బడి’కి రూ.50 లక్షల విరాళం
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న మన ఊరు–మన బడి కార్యక్రమానికి సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం రూ.50 లక్షలను అందజేసింది. గురువారం పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెక్కును సంస్థ చైర్మన్, ఫౌండర్ మావూరి వెంకటరమణ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎంఆర్  యాజమాన్యం ఆర్థికసాయం అందించడం అభినందనీయమన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్  వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ఉన్నారు.

ప్రతి హామీ అమలు చేస్తున్నాం
ఖమ్మం కార్పొరేషన్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్  తెలిపారు. గురువారం ఖమ్మం అర్భన్​ మండలంలో127 మందికి  మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం అప్పు చేయకుండా ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్​ ప్రణాళికాబద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మేయర్​ నీరజ, డిఫ్యూటీ మేయర్​ ఫాతిమా, కలెక్టర్​ వీపీ గౌతమ్, నగరపాలక సంస్థ కమిషనర్​ ఆదర్శ్​ సురభి, తహసీల్దార్​ శైలజ, సుడా చైర్మన్​ విజయ్​ పాల్గొన్నారు.


భద్రాద్రిలో నిమజ్జనానికి సర్వం సిద్ధం

3 వేలకు పైగా విగ్రహాలు వస్తాయని అంచనా
లాంచీలు, గజ ఈతగాళ్లతో పటిష్ట ఏర్పాట్లు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి గోదావరి తీరం వినాయక నిమజ్జనానికి సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా విగ్రహాలు భద్రాచలం వద్ద  గోదావరిలో నిమజ్జనం చేసేందుకు తీసుకొస్తారు. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు భద్రాచలానికి విగ్రహాలు పోటెత్తుతాయి. విగ్రహాలను నిమజ్జనం చేశాక భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని భక్తులు దర్శించుకుంటారు. దీంతో విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా దేవస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 3 వేలకు పైగా విగ్రహాలు వస్తాయనే అంచనాతో ఎండోమెంట్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, రవాణా, నీటి పారుదల శాఖల అధికారులు భక్తుల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నారు. గోదావరి తీరంలో దేవస్థానం లైటింగ్​ ఏర్పాటు చేసింది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు, దర్శనాలు, ప్రసాదాలు కూడా సిద్ధం చేస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఏఎస్పీ రోహిత్​రాజు, సీఐ నాగరాజురెడ్డి ఆధ్వర్యంలో వాహనాల క్రమబద్దీకరణకు యాక్షన్​ ప్లాన్​ తయారు చేశారు. భద్రాచలం రాగానే నేరుగా డిగ్రీ కాలేజీ, సుభాష్​నగర్​ కరకట్ట మీదుగా విగ్రహాలు స్నానఘట్టాల వద్దకు వస్తాయి. అక్కడ విగ్రహాలు నిమజ్జనం చేశాక తిరిగి కరకట్ట మీదుగా శిల్పినగర్​ వద్దకు వెళ్తాయి. అక్కడ వాహనాలు పార్కింగ్​ చేసి స్వామి దర్శనం కోసం వెళ్తారు. 1000 మందికి పైగా పోలీసులను బందోబస్తు కోసం కేటాయించారు. సింగరేణి, ఐటీసీ క్రేన్లను ఏర్పాటు చేశాయి. ఇరిగేషన్​ ఆఫీసర్లు రెండు లాంచీలతో పాటు నాటు పడవలను కూడా తెప్పించారు. గజ ఈతగాళ్లను స్నాన ఘట్టాల వద్ద లైఫ్​ జాకెట్లతో సిద్ధంగా ఉంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆఫీసర్లంతా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.


నకిలీ నర్సరీల్లో మొక్కలు కొనుగోలు చేయొద్దు
  ఆయిల్ ఫెడ్​ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని నకిలీ నర్సరీలలో రైతులు ఆయిల్​పామ్​ మొక్కలు కొనుగోలు చేసి నష్ట పోవద్దని ఆయిల్​ ఫెడ్​ చైర్మన్​ కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. గురువారం అశ్వారావుపేట మండలం నారవారిగూడెం ఆయిల్ ఫెడ్​ డివిజన్  ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 75 వేల ఎకరాలలో 55 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 8 జిల్లాల్లో ఆయిల్ పామ్  మొక్కలను పెంచేందుకు 22 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 65 ఎకరాల భూమి సేకరించామని,  రూ.200 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొర్రూరులో పామాయిల్ ఫ్యాక్టరీ కోసం 132 ఎకరాల భూమిని సేకరించామని, త్వరలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామని అన్నారు. అంతర్జాతీయ వంటనూనె ధరలను దృష్టిలో ఉంచుకొని ఫ్రూట్  ధర నిర్ణయిస్తామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి టన్ను గెలల ధర రూ.15 వేలకు తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాస్ బుక్ లేని రైతుల కోసం ఫుల్ అమౌంట్ కి మొక్కలు పంపిణీ చేసేందుకు దమ్మపేట మండలం అప్పారావుపేటలో నర్సరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నర్సరీలో రూ.250కి ఒక్కో మొక్క అందిస్తామన్నారు. డివిజన్  అధికారి వలపర్ల ఉదయ్ కుమార్, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ పాల్గొన్నారు.

సమైక్యత ఉత్సవాలను ఘనంగా చేయాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్​ అనుదీప్​ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ​నుంచి వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహించాలని సూచించారు. 16న జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్​రంగ సంస్థలు, ఆఫీసులు, వ్యాపార సముదాయాలకు లైటింగ్​ ఏర్పాటు చేయాలని అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించేలా అధికారులు ప్లాన్​ చేయాలన్నారు. ర్యాలీలో ప్రజలు భాగస్వామ్యులయ్యేలా చూడాలని సూచించారు. 17న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. 18న స్వాతంత్ర్య సమరయోధులు, రచయితలు, కవులు, ప్రముఖ కళాకారులను సన్మానించాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ప్రసాదరావు పాల్గొన్నారు. 

ఆయిల్ పామ్ సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రభుత్వ రాయితీని ఆయిల్ పామ్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని హార్టికల్చర్​ స్పెషల్​ ఆఫీసర్​ డి.విజయ లక్ష్మి కోరారు. గురువారం కొనిజర్ల, పెనుబల్లి, సత్తుపల్లిలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన మొక్కలు, డ్రిప్ పరికరాలను రైతులకు సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. పామాయిల్ పంటకు సంబంధించిన డ్రిప్ పరికరాలను ఆమె పరిశీలించారు. ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా ఆఫీసర్ అనసూయ, సందీప్ కుమార్, నగేశ్, అపర్ణ, రైతులు కృష్ణార్జునరావు, నాగేశ్వరరావు, సీతమ్మ పాల్గొన్నారు.