ఢిల్లీకి రాహుల్.. భారత్ జోడో యాత్రకు 3 రోజుల బ్రేక్

ఢిల్లీకి రాహుల్.. భారత్ జోడో యాత్రకు 3 రోజుల బ్రేక్

27న మక్తల్ నుంచి మళ్లీ రాహుల్ యాత్ర

మహబూబ్ నగర్: భారత్ జోడో యాత్రను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన అనంతరం మక్తల్లో మాట్లాడిన ఆయన.. దేశ సమైక్యత కోసమే తాను భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.

అంతకు ముందు కృష్ణా నది బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మక్తల్ లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘన స్వాగతంతో తెలంగాణలో పాదయాత్ర మొదలుపెట్టిన రాహుల్ గాంధీ దారి పొడవునా స్థానికులను పలుకరిస్తూ యాత్ర నిర్వహించారు. కుశల ప్రశ్నలు వేస్తూ.. క్షేమ సమాచారాలు... సమస్యలు అడిగి తెలుసుకుంటూ స్థానికులతో మమేకం అయ్యారు.

అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మక్తల్ నుంచి శంషాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల తర్వాత  గ్యాప్ తర్వాత  ఈ నెల 27 న తిరిగి రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు.  తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు దీపావళి పండుగ సందర్భంగా 3 రోజులు విరామం ప్రకటించారు. కర్ణాటక సరిహద్దులో నుంచి ఇవాళ ఉదయమే తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.