హైదరాబాద్‌కు చేరుకున్న భారత్ జోడో యాత్ర

హైదరాబాద్‌కు చేరుకున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. అందులో భాగంగా శంషాబాద్ నుంచి కాలేజీ విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. వారితో ముచ్చటిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. శంషాబాద్ వద్ద ఒక విద్యార్థిని భరత నాట్యం చేస్తుందని తెలుసుకొని అక్కడే కొద్దిసేపు ఉండి రాహుల్ గాంధీ నాట్యం తిలకించారు. శంషాబాద్ వద్ద ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. ఆరాంఘర్, బహదూర్ పురా, పురానాపూల్, హుస్సేనీ ఆలం, లాడ్ బజార్, చార్మినార్, మదీన, గాంధీభవన్ మీదుగా నెక్లెస్ రోడ్డుకి చేరుకోనుంది. రాహుల్ గాంధీ రాక కోసం ఆరాంఘర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ... చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 

పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ యాత్రలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అందరూ నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ ఆవు యాత్రలోకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన నేతలు.. చెల్లాచెదురుగా అయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. 

భారత్ జోడో యాత్రను ఉత్సాహంగా సాగిస్తోన్న రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ‌‌‌‌‌‌‌‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకేరకం పార్టీలని, వందల కోట్ల అవినీతి సొమ్మును ఎలక్షన్ల కోసం, నాయకుల కొనుగోళ్ల కోసం ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న విద్వేషపూరిత, విచ్ఛిన్న రాజకీయాలను తిప్పికొట్టి, ప్రజల్లో సమైక్యతను తీసుకొచ్చేందుకే తాను యాత్ర చేస్తున్నానని తెలిపారు. యాత్రతో చాలా విషయాలు నేర్చుకుంటున్నానని, యాత్ర తప్పకుండా పార్టీ ఉన్నతికి తోడ్పడుతుందన్నారు.