భారత్ జోడో యాత్రకు ముఖ్యనేతలు.. కాంగ్రెస్ ప్రచారంలో స్తబ్ధత

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: మునుగోడు కాంగ్రెస్ లో జోష్ తగ్గింది. కాంగ్రెస్  ముఖ్య నేతలంతా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వెళ్లడంతో ఆ పార్టీ ఉప ఎన్నికల ప్రచారంలో స్తబ్దత నెలకొంది. రెండు రోజులుగా కేవలం ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఒంటరిగానే గ్రామాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆమెతో స్థానిక బూత్ ఇన్ చార్జి, లోకల్ క్యాడర్ మాత్రమే వెంట వస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనకబడి ఉండగా..ఈ నెల 27న రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రాహుల్ జోడో యాత్ర ఎఫెక్ట్ తో మరింత వెనకబడింది. బై పోల్ అంతా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతుండడం ఆ పార్టీని నమ్ముకుని ఉన్న క్యాడర్ ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ముఖ్య నేతలు విడతలవారీగా జోడో యాత్రకు వెళ్లి, మునుగోడుపై దృష్టి పెడితే బాగుండేదనే వాదన శ్రేణుల నుంచి వినిపిస్తోంది. నేతల తీరు చూస్తే మునుగోడు స్థానంపై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోందని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

టీఆర్ఎస్, బీజేపీలో అలా.. కాంగ్రెస్  ఢీలా..

టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం 86 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు సహా పార్టీ ముఖ్యులంతా మునుగోడులోనే అడ్డా వేశారు. ప్రతి రోజూ వందలాది మందితో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మర్రిగూడ క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా, బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ మునుగోడు క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా ఉంటూ నియోజకవర్గవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరితోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ప్రచారానికి 38 మంది నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమిస్తే.. వీళ్లలో కనీసం ఐదుగురు కూడా సీరియస్ గా తిరగడం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ నేతల ప్రచారం రోజూ ప్రతి మండలంలోని నాలుగైదు గ్రామాల్లో ఉంటే.. స్టార్ క్యాంపెయినర్లు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కేవలం ఒకటి, రెండు మండలాలకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రచారంలో అభ్యర్థి పాల్వాయి స్రవంతితోపాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పార్టీ కూడా మండలాలు, బూత్ ఇన్ చార్జీలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వి.హనుమంతరావు, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, గీతారెడ్డి తదితర  సీనియర్ నాయకులను నియమించినప్పటికీ వారు ఆశించిన మేర పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రేవంత్ కామెంట్స్​తో క్యాడర్​లో నిరుత్సాహం ..

మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ బై ఎలక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఆయనతో సీనియర్లంతా సీరియస్ గా కలిసి రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రచార బాధ్యత అంతా తన భుజాలపైనే వేసుకోవాల్సి వచ్చింది. సీనియర్లు రాకపోవడం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని కూడా నిరాశకు గురి చేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీకి సమానంగా పోటీ ఇస్తుందనుకున్న సమయంలో..ఈ నెల 20న రేవంత్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందని కన్నీటి పర్యంతం కావడం పార్టీ క్యాడర్ ను గందరగోళంలో పడేసిందనే వాదన వినిపిస్తోంది. దీంతో సెంటిమెంట్ పండకపోగా మునుగోడులో కాంగ్రెస్ బలహీనంగా ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.