- జైలుకు పంపినా నిందితుడి తీరు మారలే..
- న్యాయం చేయాలని ఉప్పల్ పీఎస్ ముందు బాధితుల ఆందోళన
ఉప్పల్, వెలుగు: టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరిట సిటీలో భారీ మోసం జరిగింది. ఉప్పల్ కళ్యాణపురిలో భరత్ కుమార్ శర్మ అనే వ్యక్తి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. మానస సరోవరం, ఇతర పుణ్యక్షేత్రాల టూర్స్ అంటూ సోషల్ మీడియాలో భారీగా పబ్లిసిటీ చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన యాత్రికుల నుంచి ఐదేండ్లలో రూ.15 కోట్ల వరకు దండుకున్నాడు. అయితే, వారిని టూర్స్‌కు తీసుకెళ్లకుండా మూడేండ్ల నుంచి కరోనా పేరు చెప్పి తప్పించుకు తిరిగాడు.
ఒక్కొక్కరి నుంచి రూ.2–3 లక్షలు వసూలు చేసినట్లు 500 మంది బాధితులు గతంలో ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భరత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. కొన్నిరోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మళ్లీ యాత్రల పేరిట వసూళ్లు చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని ఉప్పల్పీఎస్ ముందు ఆదివారం ఆందోళన చేశారు. కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.