Multibagger: లక్ష ఇన్వెస్ట్ చేసినోళ్లను కోటీశ్వరులుగా మార్చేసిన స్టాక్.. మీరూ కొన్నారా?

Multibagger: లక్ష ఇన్వెస్ట్ చేసినోళ్లను కోటీశ్వరులుగా మార్చేసిన స్టాక్.. మీరూ కొన్నారా?

Bharat Rasayan Share: పులితో వేట స్టాక్ మార్కెట్లలో ఆట అంత ఈజీ కాదు. రెండింటిలో గెలవాలంటే కావాల్సింది ఓపికతో పాటు కొంత ప్లానింగ్. స్టాక్ మార్కెట్లు ఎల్లప్పుడూ ఓపిక కలిగే ఇన్వెస్టర్లను భారీగా రివార్డ్ చేస్తుంటాయి. ఈ విషయం గతంలోనూ అనేక సార్లు రుజువైంది. మంచి షేర్లను ఎంచుకోవటం, వాటికోసం కొంత సమయాన్ని కేటాయించటం మల్టీబ్యాగర్ స్టాక్ వేటగాళ్లకు కావాల్సిన అసలైన ఆయుధాలని గుర్తుంచుకోవాలి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చేసిన భారత్ రసాయన్ కంపెనీ షేర్ల గురించే. వివరాల్లోకి వెళితే స్టాక్ మార్కెట్ల 2008 పతనం తర్వాత 2009లో ఈ కంపెనీ షేర్ల ధర కేవలం ఒక్కోటి రూ.39.40 వద్ద ఉంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.11వేల96గా ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది. అంటే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ గడచిన 16 సంవత్సరాల నిరీక్షణలో 28 వేల శాతానికి పైగా భారీ రాబడులను అందించింది. అయితే ఈ మధ్యలో అనేక మార్లు స్టాక్ మార్కెట్లు కరెక్షన్ ఫేజ్ చూసినప్పటికీ మల్టీబ్యాగర్ మాత్రం తన గ్రోత్ జర్నీని అస్సలు మానకపోవటం గమనార్హం. 

ఇక ప్రస్తుతానికి వస్తే ఎవరైనా ఇన్వెస్టర్ 2009 సమయంలో కంపెనీ షేర్లలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే సదరు పెట్టుబడి విలువ రూ.2.81 కోట్లకు చేరుకుంది. అంటే కేవలం ఒక్క లక్షను ఇందులో పెట్టిన ఇన్వెస్టర్లు ఏకంగా కోటీశ్వరులాగా మారిపోయారు. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్ల ధరను గమనిస్తే మధ్యాహ్నం 2.47 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కో స్టాక్ ధర రూ.11 వేల 34 వద్ద కొనసాగుతోంది. నేడు స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ కంపెనీ షేర్లు మాత్రం దాదాపు 4.4 శాతం లాభంతో ముందుకు దూసుకుపోతోంది.

ALSO READ | Upper Circuit: ప్రముఖ ఇన్వెస్టర్ కొన్న స్టాక్.. ఎగబడుతున్న రిటైలర్స్, 20 శాతం అప్..

ఇదే క్రమంలో ఇక వేరువేరు కాలాలకు ఇన్వెస్టర్లు పొందిన రాబడులను పరిశీలిస్తే.. ఐదేళ్ల కిందట లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల డబ్బులు కేవలం డబుల్ చేయబడి రూ.2.09 లక్షలుగా మారాయి. అయితే గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీ షేర్ల ధర 2 శాతానికి పైగా నష్టాన్ని చూడటం గమనార్హం. అలాగే 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు దాదాపు 9 శాతం పెరుగుదలను నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అందుకే మల్టీబ్యాగర్ స్టాక్ తక్కువ ధరల వద్ద గుర్తించి వాటితో దీర్ఘకాలిక ప్రయాణాన్ని కలిగి ఉండటం నిజంగా లాభాలను అందిస్తుందని భారత్ రసాయన్ కంపెనీ షేర్లు మరోసారి నిరూపించాయి. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.