భారత్ సమ్మిట్-2025 గ్రాండ్ సక్సెస్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

భారత్ సమ్మిట్-2025 గ్రాండ్ సక్సెస్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • తెలంగాణ గొప్పతనాన్ని చాటింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్–2025 సక్సెస్​ అయ్యిందని, ఇది తెలంగాణ గొప్పతనాన్ని చాటిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారత్ సమ్మిట్ నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేయడానికి భారత్ సమ్మిట్ ఓ వేదికగా నిలిచిందని తెలిపారు. ప్రపంచ శాంతి, ప్రపంచ న్యాయం, వాతావరణ మార్పులు, టెర్రరిజం అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల బాధలను క్లుప్తంగా వివరించారని చెప్పారు. అన్యాయం ఎదుర్కొని కొత్త శకాన్ని సృష్టించి శ్రామికుల హక్కులను కాపాడాలని తీర్మానించారని పేర్కొన్నారు. 

ప్రగతిశీల ఉద్యమాల అణిచివేత, మీడియాపై దాడులను రాహుల్ గాంధీ ఖండించారని చెప్పారు. సమ్మిట్ వేదికగా రాహుల్ గాంధీ ప్రగతిశీల పార్టీల ప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ డిక్లరేషన్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సమ్మిట్ లో ప్రపంచానికి న్యాయం అందించడం థీమ్ కింద 44 పాయింట్ల ఎజెండాను ఆమోదించడం జరిగిందని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, విలువల నిబద్ధతకు సమ్మిట్ తీర్మానం పునరుద్ఘాటిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం, సామాజిక న్యాయం కోసం కృషి చేయడం, శాంతి, మానవ భద్రత కోసం పనిచేయడం వంటి అంశాలపై సమ్మిట్​లో తీర్మానం చేసినట్లు చెప్పారు. భారత్ సమ్మిట్ కు 100 దేశాలకు పైగా ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిపి మొత్తంగా 450 మంది హాజరై తమ అనుభవాలను పంచుకున్నారని పేర్కొన్నారు.