- ప్రజల కోసం పనిచేసే గడ్డం వినోద్ ను గెలిపించాలి
- నేతకాని మహర్ హక్కుల సంఘం
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య నేతకాని కులానికి తీరని ద్రోహం చేశారని నేతకాని మహర్ హక్కుల సంఘం జాతీయ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ భరత్ వాగ్మేర మండిపడ్డారు. గురువారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని టీసీఓఏ క్లబ్ మైదానంలో ఏర్పాటు చేసిన నేతకాని కులస్తుల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ దుర్గం గోపాల్, జిల్లా అధ్యక్షుడు కామెర దుర్గయ్యతో కలిసి మాట్లాడారు.
నియోజకవర్గంలో 40 వేల మంది నేతకాని కులానికి చెందిన ప్రజలు ఉన్నారని.. తమ సామాజిక వర్గానికే చెందిన దుర్గం చిన్నయ్యను రెండు సార్లు గెలిపిస్తే ఒక్క నేతకాని కుటుంబాన్ని ఎదగనీయలేదన్నారు. అగ్రకులానికి చెందిన వారితో చేతులు కలిపి నేతకానీలను అనగదొక్కాడని ఫైర్ అయ్యారు. నేతకానీల అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
నేతకానీ కుల సంఘంభవనానికి స్థలం ఇప్పిస్తా
నేతకానీ కులస్తులు తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించుకోవాలని, గెలిచాక నేతకాని సంక్షేమం కోసం కృషి చేస్తానని గడ్డం వినోద్అన్నారు. నేతకానీల సమస్యలు పరిష్కరించడంతో పాటు బెల్లంపల్లిలో కుల సంఘ భవనానికి వెయ్యి గజాల స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దుర్గం చిన్నయ్య తరహాలో ప్రజల భూములు కబ్జా చేయనని, బెల్లంపల్లిలోనే ఇల్లు నిర్మించుకొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. రెండు సార్లు పాలించిన చిన్నయ్య నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ కర్కూరి రాంచందర్, మాజీ ఎంపీటీసీ గూట్ల వెంకటలక్ష్మి, నేతకాని మహర్ హక్కుల సంఘం జిల్లా, రాష్ట్ర నాయకులు రత్నం ప్రదీప్, గట్టు బానేశ్, గట్టు మల్లేశ్, దాగం రమేశ్, దుర్గం లక్ష్మి, జుమ్మిడి బానయ్యలతో పాటు రెండు వేల మందికిపైగా నేతకానీలు పాల్గొన్నారు.
ALSO READ: బాల్క సుమన్ కు వ్యతిరేకంగా .. ఓయూ జేఏసీ విద్యార్థుల ప్రచారం
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ టౌన్ అధికార ప్రతినిధి
బీఆర్ఎస్ బెల్లంపల్లి టౌన్ అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, 18వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కుంభాల రాజేశ్ తోపాటు మరో 100 మంది లీడర్లు కాంగ్రెస్ నేత మునిమంద రమేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. టీసీఓఏ క్లబ్ లో జరిగిన నేతకానీల సభలో వీరికి గడ్డం వినోద్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే చిన్నయ్య తమను అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే వినోద్ నాయకత్వంలో కాంగ్రెస్ కోసం పనిచేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని చిన్నయ్యను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముడిమడుగుల మహేందర్, రత్నం ప్రదీప్, కార్కూరి రాంచందర్, దూడపాక బలరాం, దుర్గం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.