న్యూఢిల్లీ: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. వయసు పైబడిన రీత్యా వచ్చిన తీవ్ర అనారోగ్య సమస్యలతో గత ఏడు నెలలుగా ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు యామినీ కృష్ణమూర్తి మేనేజర్ అండ్ సెక్రటరీ గణేష్ మీడియాకు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆమె పార్థివ దేహాన్ని యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కు అభిమానుల సందర్శనార్థం తరలించనున్నారు.
భరత నాట్యం గురించి ప్రస్తావన వస్తే యామినీ కృష్ణమూర్తి పేరు రాకుండా ఆ చర్చ ముగియదు. నృత్య కళకు ఆమె అందించిన సేవలకు గాను 1968లోనే పద్మశ్రీతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. ఆమెకు ఇద్దరు తోడబుట్టిన సోదరీమణులు ఉన్నారు. యామినీ కృష్ణమూర్తి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కూడా సేవలందించారు. భరత నాట్యం మాత్రమే కాదు కూచిపూడిలో కూడా ఆమె ఎన్నో ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందారు. ఆమె అంత్యక్రియలు ఎప్పుడనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు.