మధ్యప్రదేశ్ ఓటర్ల మొగ్గు..ఎటువైపు?

మధ్యప్రదేశ్ ఓటర్ల మొగ్గు..ఎటువైపు?

మధ్య ప్రదేశ్​లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అంత తేలిక కాదనిపిస్తోంది. కుల సమీకరణలకు మధ్య ప్రదేశ్ కూడా మినహాయింపు కాకపోవడం అందుకు ఒక కారణమని చెప్పవచ్చు. 

మధ్య ప్రదేశ్ లో ఓటర్లు సుమారుగా 5 కోట్ల 39 లక్షల మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఈ ఏడాది అక్టోబర్ 1 వరకు అవకాశం ఉంది. కనుక, ఓటర్ల సంఖ్య ఇంకా పెరగవచ్చు. కొత్త ఓటర్లలో   18,-19 ఏండ్ల మధ్య వయసువారు ఎక్కువగా ఉండడం సహజం.  మధ్యప్రదేశ్ ​రాష్ట్రంలోని 41 జిల్లాలలో  230 శాసనసభా  నియోజకవర్గాలున్నాయి. రాష్ట్ర జనాభాలో దళితులు 14 శాతం మంది, గిరిజనులు 21 శాతం మంది ఉంటారు.  కాంగ్రెస్ ​అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఈ రెండు వర్గాలతోపాటు అగ్రకులాల వారిని ముఖ్యంగా రాజ్​పుత్ లను కూడగట్టుకుని గతంలో కాంగ్రెస్ ను వరుసగా రెండుసార్లు అధికారానికి తీసుకురాగలిగారు. దళితులు, గిరిజనులకు విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కొంతవరకు ప్రశంసనీయమైన కృషి చేసింది.

కానీ, రోడ్లు, విద్యుత్​ వంటి మౌలిక సదుపాయాలు అధ్వానంగా తయారవడంతో బీజేపీ బిజిలీ, సడక్, పానీ నినాదాన్ని అందుకుంది. అది ప్రజలను బాగా ఆకట్టుకుని 2003లో కాంగ్రెస్ ఓటమికి దారితీసింది. రాష్ట్ర జనాభాలో ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ)వారు  దాదాపు 40 శాతం మేరకు ఉన్నారు. కాంగ్రెస్ దళితులు, గిరిజనులను ఎక్కువగా అక్కున చేర్చుకుంటున్నట్లు కనిపించడంతో ఓబీసీలు సహజంగానే బీజేపీ పంచన చేరారు. ఉమాభారతి, శివరాజ్ సింగ్​ చౌహాన్ వంటి ఓబీసీ నాయకులు ఈ విషయంలో కీలక పాత్ర వహించారు. 

రైతులకు బీజేపీ భరోసా

మధ్య ప్రదేశ్ లో సగం పైగా జనాభా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓబీసీలను కూడా రైతులనే స్థూల వర్గం కిందకు తీసుకురావడంలో  సఫలమయ్యారు. దానికి తగ్గట్లుగానే సేద్యపు నీటి సదుపాయాలను ఆయన విస్త రింపజేశారు. భూగర్భ జలాలపై ఆధారపడిన రైతులకు అంతరాయం లేకుండా నిరంతరం కరెంటు సరఫరా ఉండేటట్లు చూశారు. పంటల కొనుగోలు పద్ధతులను సైతం మెరుగుపరచారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చించారు. దీంతో మధ్య ప్రదేశ్ లో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇది బీజేపీ దాదాపు ఇరవై ఏండ్లుగా మధ్య ప్రదేశ్ లో అధికారంలో ఉండడానికి దోహదపడింది. 

అధికారం కోసం కాంగ్రెస్ కసరత్తు

ఇరవై ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడడం సహజం. దాని నుంచి వీలైనంత లబ్ధి పొందాలని ప్రస్తుతం కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఓబీసీలకు రిజర్వేషన్లలో కోటా పెంచుతామని వాగ్దానం చేయడం ద్వారా వారిని తన వైపునకు తిప్పుకొనే ప్రయత్నం కాంగ్రెస్​ చేస్తోంది. గిరిజనులు, దళితులలో అధికులు కాంగ్రస్ వైపు ఉండటం హస్తం పార్టీకి ఉత్సాహానిస్తోంది. 

జ్యోతిరాదిత్యకు చుక్కెదురు

మధ్య ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  గుణ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జ్యోతిరాదిత్య ఓటమిపాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో కాంగ్రెస్ ఎన్నికల సన్నద్ధతను మెరుగుపరిచే బాధ్యతను అధిష్టానం జ్యోతిరాదిత్యకు అప్పగించడంతో ఆయన సొంత నియోజకవర్గంపై  ఎక్కువ  దృష్టిని కేంద్రీకరించలేకపోయారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  పోనీ, ఆ త్యాగం ఏమైనా ఫలితమిచ్చిందా అంటే  ఉత్తర ప్రదేశ్ లోని 80 లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది.

రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్​ అగ్రనేత్రి సోనియా గాంధీ మాత్రమే గెలుపొందగలిగారు. మరోవైపు అమేథీ నుంచి రాహుల్ గాంధీతో సహా మిగిలిన కాంగ్రెస్ సభ్యులందరూ బీజేపీ అభ్యర్థుల చేతిలో మట్టికరిచారు. బీజేపీ అధికంగా 62 సీట్లు గెలుచుకోగా,  బీఎస్పీ 10 సీట్లు,  ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. అప్నా దళ్ (సోనీలాల్) పార్టీ తరఫున ఇద్దరు లోక్ సభకు ఎన్నికయ్యారు. 

సింధియా తిరుగుబాటు

 మధ్యప్రదేశ్​లో జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నాయకుడికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే, ఆయన మంచి పేరు తెచ్చుకుని రాహుల్ గాంధీకి పార్టీలో పోటీగా తయారవుతారేమోనని సోనియా గాంధీలో భయం నెలకొంది. రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు అవకాశం ఇవ్వకపోవడానికి కూడా అదే కారణంగా కనిపిస్తోంది. రాజ్య సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య ప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్​కు అవకాశమిచ్చింది. కానీ, జ్యోతిరాదిత్యను మాత్రం పక్కన పెట్టింది.

దాంతో కోపం నషాళానికి అంటిన జ్యోతిరాదిత్య తనకు విధేయులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించారు. కమల్ నాథ్ ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పకూలింది.  ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్యను ఆ పార్టీ రాజ్యసభకు సునాయాసంగా ఎంపిక చేయించింది.  మధ్యప్రదేశ్​లో  హస్తం పార్టీ అధికారానికి దూరమవగా  కేంద్రంలో జ్యోతిరాదిత్య మంత్రి పదవిని అధిష్టించారు. 


బీజేపీదే పైచేయి

సంస్థాగతంగా మాత్రం కాంగ్రెస్ కన్నా బీజేపీదే పైచేయి అనక తప్పదు. ముఖ్యంగా నగరాల్లో, మాల్వా ప్రాంతంలోనూ కమలం పార్టీకి కార్యకర్తల బలగం దండిగా ఉంది. పైగా, ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార నిర్వహణ కమిటీ కన్వీనర్ గా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ తోమర్ నియమితులయ్యారు. మూడుసార్లు లోక్ సభకు ఎన్నికైన తోమర్ గతంలో రెండుసార్లు శానసభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే కర్నాటకను చేజార్చుకున్నట్లుగా మధ్య ప్రదేశ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని బీజేపీ పట్టుదలతో ఉంది.  బహుశా, ఆ దృష్టితోనే కాబోలు, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తోమర్ తోపాటు మరో కేంద్ర మంత్రి ఫగ్గన్​ సింగ్​కులస్తే, రాష్ట్రానికి చెందిన ముగ్గురు బీజేపీ లోక్ సభ సభ్యులను కూడా పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా ఈసారి  అసెంబ్లీ  ఎన్నికల బరిలోకి హైకమాండ్​ దింపవచ్చని భావిస్తున్నారు. 

కాంగ్రెస్ స్వయంకృతాపరాధం

గత 2018 నవంబర్ లో జరిగిన  మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 114 సీట్లు రాగా బీజేపీ 109 సీట్లును దక్కించుకుంది. బీజేపీకి 41.02 శాతం ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ కి 40.89 శాతం ఓట్లు లభించాయి. బీఎస్పీకి రెండు సీట్లు లభించాయి. అదేవిధంగా సమాజ్ వాది పార్టీ  కూడా ఒక సీటు గెలుచుకుంది. ఇండిపెండెంట్లు నాలుగుచోట్ల నుంచి గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరం కాగా, బీఎస్పీ, ఎస్పీ, నలుగురు ఇండిపెండెంట్ల సాయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీలో ఏర్పడినా అది కేవలం 15 నెలలు మాత్రమే అధికారంలో ఉండగలిగింది. జ్యోతిరాదిత్య సింధియా ప్రోద్బలం మేరకు  22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్​నాథ్​ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన కమల్ నాథ్ విశ్వాస పరీక్షకు ముందుగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీకి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షుడుగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం జ్యోతిరాదిత్యను కాదని అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని కమల్​నాథ్​కు కట్టబెట్టడంతో  కాంగ్రెస్​ పార్టీ అధికారం చేపట్టిన మొదట్లోనే ముసలం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్​లో జ్యోతిరాదిత్య దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం కమల్ ‘నాథ్’ నుంచి  కమలం పార్టీ వశమైంది. కాంగ్రెస్ ఒక రకంగా చేసుకున్న స్వయంకృతాపరాధంతో మధ్య ప్రదేశ్ ను చేజేతులా జారవిడుచుకుంది.

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్