
- సీపీ శ్రీనివాస్
నస్పూర్, వెలుగు: లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చేవరకు ‘భరోసా సెంటర్’ అండగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. సీసీసీ నస్పూర్ పాత పోలీస్ స్టేషన్ భవనంలోని భరోసా సెంటర్ను సోమవారం సీపీ సందర్శించారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలకు డాక్టర్, సైకాలజిస్ట్, న్యాయాధికారి, పోలీసుల సహాయంతోపాటు పరిహారం ఇప్పించేవరకూ భరోసా కేంద్రం పనిచేస్తోందన్నారు. బాధితు లకు నైపుణ్యాలు నేర్పించి, సమాజంలో ఉన్నతంగా జీవించేలా సెంటర్ దోహదపడుతుం దని పేర్కొన్నారు.
అందుబాటులో వున్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేశ్ కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, షీ టీం ఇన్చార్జి ఎస్ఐ హైమ, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
భరోసా సెంటర్ సేవలు భేష్
ఆసిఫాబాద్: బాధిత మహిళలు, చిన్నారులకు అండగా భరోసా సెంటర్ సేవలందిస్తోందని డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆసిఫాబాద్జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ప్రారంభించి ఏడాదైన సందర్భంగా డీసీఆర్బీ డీఎస్పీ కరుణాకర్ భరోసా సెంటర్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. లైంగిక దాడికి గురైన మహిళలకు, బాలికలకు భరోసా సెంటర్ అండగా నిలుస్తోందన్నారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. వేధింపులకు గురైన బాధితులు 8712670561 నంబర్ ద్వారా భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.