సూర్యాపేట, వెలుగు: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు గోస అనుభవిస్తున్నారని, వారికి భరోసా కల్పించేందుకే రాష్ట్రంలో బీజేపీ భరోసా యాత్ర చేపట్టినట్లు మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశిస్తే కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు.
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఎక్కడ ఏ స్కామ్ జరిగిన తెలంగాణలోని కేసీఆర్ కుటుంబసభ్యులు, సన్నిహితుల ప్రమేయం ఉంటుందన్నారు. సూర్యాపేట జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ కాళేశ్వరం నీళ్లు రావడం లేదని, కేవలం ఎస్సారెస్పీ నీళ్లు మాత్రమే వస్తున్నాయన్నారు. కానీ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయం కోసం పార్టీ మారలేదని, తెలంగాణ భవిష్యత్ కోసం పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి మందిని తాగుబోతులుగా మార్చి ,మద్యంపై వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలను సీఎ కేసీఆర్ నడిపిస్తున్నారని చెప్పారు.
ధరణి ఒక బోగస్ అని, లక్ష ఎకరాల భూములను టీఆర్ఎస్కాజేసే ప్రయత్నం చేస్తోందన్నారు. డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంశాలపై అసెంబ్లీలో బీజేపీ గళం వినిపిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ కుట్రలు తిప్పి కొట్టేందుకు బీజేపీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కడియం రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.