గుజరాత్ రాష్ట్రం భరూచ్ జిల్లా అంకలేశ్వర్ సిటీలో జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న థర్మాక్స్ అనే కంపెనీలో.. 10 ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది. అర్హత ఉన్న వారు.. సిటీలోని ఓ హోటల్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి అనేది ఆ జాబ్ నోటిఫికేషన్ సారాంశం.
ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగులు పోటెత్తారు. 10 ఉద్యోగాలకు వేలాది మంది తరలివచ్చారు. దీంతో హోటల్ ఆవరణలోని సెక్యూరిటీ రెయిలింగ్స్ విరిగిపోయాయి. నిరుద్యోగులు కింద పడ్డారు. స్వల్పగాయాలతో బయటపడినా.. అక్కడ రద్దీ.. తొక్కిసలాట తరహాలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియోనే సాక్ష్యం అంటూనే.. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ప్రమాదకరంగా మారాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బహిరంగంగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కంపెనీలు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశంలో అర్హతలు ఉండి కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితులు ఓవైపు అయితే.. ఉన్న ఒక్క ఉద్యోగానికి వేల మంది పోటీ పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లతుంది. గుజరాత్ రాష్ట్రంలోనే పరిస్థితులు ఇలా ఉంటే.. ఇక బీహార్, యూపీ రాష్ట్రాల్లో నిరుద్యోగ తీవ్రత ఎలా ఉంటుందో.. ఒక్క నోటిఫికేషన్ వేస్తే తెలుస్తుంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.