తత్పురుషాయ విద్మహే మహాదేవాయ
ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్| అంటూ శివభక్తులు సంస్మరించే పుణ్యదినం మహాశివరాత్రి. దేవుళ్లలో మహాదేవుడు అనే పేరు శివుడికి మాత్రమే ఉంది. అలాంటి శివుడు భోళాశంకరుడు. అభయంకరుడు, లయకారుడు. అమృత స్వరూపుడు... మృత్యుంజయుడు, ఆ దేవదేవుణ్ణి అర్చించే, ధ్యానించే గొప్ప పర్వదినం మహాశివరాత్రి.
శివుడు రాత్రి దేవుడు
విష్ణువును పగలు ఉపాసించాలి, శివుణ్ణి రాత్రి వేళ ఉపాసించాలి, శివుడు రాత్రి దేవుడు ఎలా అయ్యాడు? ‘సంస్కృతంలో ’ అహోరాత్ర'మనే పదం ఉంది. అహః అంటే పగలు, రాత్రము అంటే రాత్రి కాబట్టి అహోరాత్రమనే పదానికి పగలు, రాత్రి కలసిన 'ఒకరోజు' అని అర్థం. ఈ అహోరాత్రి పదంలో ఉన్న 'అహః' అనే పదానికే మళ్లీ 'ఒకరోజు' అనే అర్థం కూడా ఉంది. ఏకాహం, సప్తాహం... అనే వాటికి ఒక రోజు, ఏడురోజులు అని అర్థం కదా! ఇలా రెండర్థాలూ ఉంటే శ్రీహరికున్న వేయినామాల్లో 'అహః' (అహస్సంవత్సరో వహ్నిః) అనే పేరు ఒకటి వేరుగా కన్పిస్తుంది.
అంటే శ్రీహరి 'పగటి దైవం' అని దీని అర్థంగా భావించాలి. ఇదేమిటి? ఎక్కడా వినలేదే ఇలాంటి భావాన్ని? అన్పిస్తుంది మనకి. శ్రీహరి స్థితికారకుడు -అంటే -రక్షణ చేసేవాడు... ప్రాణి సమూహం అంతా మేల్కొని ఉన్నప్పుడు కదా రక్షణ ఆవశ్యకత కలిగేది. ఇక రాత్రివేళ ఎలా వ్యక్తి నిరాడంబరంగా, సహజత్వంతో ఉంటాడో అలా కన్పిస్తాడు శంకరుడు. ఈ పగలు -రాత్రి కలిసినప్పుడే 'రోజు' అనేది అవుతోంది కాబట్టి శివకేశవులుభయులూ ఒక్కటై కన్పించేదే జగత్తని అర్థం చేసుకోవాలన్నమాట.
ఈ ఇద్దరూ పగటికీ, రాత్రికీ సంకేతరూపాలు. కాబట్టే విష్ణువు అవతార రూపమైన రామచంద్రునికి మిట్టమధ్యాహ్నం వివాహం జరిగితే, శంకరునికి అర్ధరాత్రి కాలం దాటాక ప్రారంభమౌతుంది కల్యాణం. అక్కడ ఎండవేడిమికి తాళలేక, స్వేదానికి తట్టుకోలేక విసనకర్రలు అవసరమైతే, ఇక్కడ చలి, మంచు బాధకి తాళలేక శరీరంలోని వణుకుకి తట్టుకోలేక గొంగళ్లు అవసరమౌతాయి. అక్కడ సువాసనలీనే చందన చర్చ స్వామికి సాగితే, ఇక్కడ సువాసన ఏ మాత్రమూ ఉండని భస్మలేపనం సాగుతుంది స్వామికి.
అక్కడ స్వామికి శిరోభూషణంగా నెలవంక (చంద్రుడు రాత్రి ప్రకాశించేవాడు) కన్పిస్తాడు. విష్ణువు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాది జాతులందరికీ అనందాన్ని కల్గించేవాడౌతుంటే శంకరుడు పిశాచ, భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చేవాడౌతుంటాడు. ఆయన వైకుంఠంలో ఉంటే ఈయన రుద్రభూమిలో కన్పిస్తాడు. ఇలా ఇరువురిలో ఎన్నో సామ్య వైషమ్యాలు కన్పిస్తాయి. అందుకే ఈ ఇద్దరిలో ఏ ఒక్కరితోనో లోకం నడక సాగదనీ ఇరువురి అవసరమూ ఉందనీ మనకర్థమౌతుంది. ఇప్పటికి శివుడు రాత్రి దైవమనీ, ఆయనకి సంబంధించిన ఈ పర్వదినం 'శివరాత్రి' ఔతోందనీ మనకి అర్థమయింది.
మహాశివరాత్రి నిర్ణయం
మాఘమాస 'బహుళచతుర్దశి' నాడు శివరాత్రి జరుపుకుంటారు. ఇది సోమవారం వస్తే మరింత ప్రశస్తంగా చెప్తారు. శివరాత్రిపర్వం విషయంలో మనజ్యోతిష శాస్త్రాలు ప్రత్యేక నియమం విధించాయి. బహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి వరకు ఉండాలి. అర్ధరాత్రి సమయంలో బహుళ చతుర్దశి లేకుండా అమావాస్య ప్రకాశిస్తే, అంతకుముందురోజే శివరాత్రి జరుపుకోవాలి. రాత్రివేళలో తప్పక చతుర్దశి ఉండాలి. రాత్రివ్యాప్తి ఎక్కువ ఉన్న బహుళ చతుర్దశి -శివరాత్రి. ఇది మాసశివరాత్రి. సంవత్సరంలో మాఘమాస బహుళ చతుర్దశి నాడు జరిపేది మహాశివరాత్రి. రాత్రివేళ సాధనచేసే ప్రధానపండుగ. కాబట్టి దానికి శివరాత్రి అనిపేరు. శివుని రాత్రి అని దీని అర్థం.
శివరాత్రి ఆచరణ
మహాశివరాత్రి రోజు ఉదయమే భక్తులంతా మేల్కొంటారు. స్నానాదులొనర్చి ఇంట్లో శివపూజలు చేసుకొని దేవాలయ సందర్శనం - వీలైతే జ్యోతిర్లింగంగాని, ప్రసిద్ధ దేవాలయం గాని దర్శిస్తారు. సాయంత్రం ప్రదోషకాలం నుండి రాత్రంతా పూజలు, శివనామ స్తోత్ర పారాయణలు, అర్చనలు, అర్ధరాత్రి అభిషేకాలు, శివలీలా పారాయణం చేస్తూ జాగారం చేస్తారు.ఉపవాసం ఉండడం ఈ పండుగ ప్రధాన నియమం. శివరాత్రి నాడు భస్మం తయారుచేయడం, ధారణ చేయడం ఆనవాయితీ, శివరాత్రినాడు జరిపే ఈ ఉపాసన పాపవిముక్తి కలిగించి శివసాయుజ్యం కలిగిస్తుందని శాస్త్రం తెలుపుతోంది.
- డా. పి. భాస్కర యోగి,ధార్మిక, సామాజిక వేత్త