సమన్యాయం కోసం ప్రశ్నిస్తే తప్పా?

ఈ నెల 21న నేను రాసిన ‘కేంద్ర సాహిత్య అకాడమీకి ఎర్ర పక్షపాతం’ అనే వ్యాసానికి స్పందనగా వచ్చిన ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వ్యాసం ఆసక్తికరంగా ఉంది. ఎందుకో అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు స్తుతితో ఎస్వీ స్పందన ప్రారంభించారు. కార్యదర్శికి ఇందులో ఏ భాగస్వామ్యం ఉండదు, అంతా ‘రాజ్యాంగం’ నడిపిస్తుందని అన్నారు. ఇక్కడ కృత్తివెంటి సాహిత్య అకాడమీకి కర్త, కర్మ, క్రియ అని అక్కడి కార్యకలాపాలు అందరికీ తెలుసు. అందుకే ఆయనను నేను ‘కార్యదర్శి’ అనకుండా ‘కన్వీనర్’ అన్నాను. ఆయన ‘ముఖం’తో వెనుక ఉండి నడిపించే శక్తులు ఎవరు అనేది పరోక్షంగా ‘ఎస్వీ’ బయట పెట్టారు. అకాడమీలో ‘లెఫ్టిస్టుల దురాక్రమణ’ ఉంది అని తెలుగునాట సాహిత్యంతో పరిచయం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. అతనిపై నాది వ్యక్తిగత విమర్శ కాదు. మరి ‘భారత రాజ్యాంగం’  లెఫ్ట్ వింగ్ కు మాత్రమే రాజ్యాంగమా? అన్నదే ప్రశ్న. అందులో జ్యూరీ సభ్యులు, సలహా మండళ్లు, అవార్డు పొందినవారు, సెమినార్లలో పాల్గొన్నవారి చిట్టాను బయటపెడితే దేశం తెలుసుకుంటుంది కదా!

ప్రశ్నించడం నేరమా?

ఎస్వీ చెప్పిన ‘నిర్దిష్ట ఆదర్శాలతో, ఉన్నత ఆశయాలతో’ నడిచే సంస్థకు ఈ ‘ఎడమ చేయి వాటం’ ఎందుకు ? ఆశయాలు, ఆదర్శాలు కేవలం ఓ వర్గానికే పరిమితమా?  ప్రభుత్వాల చేత నడిచే సంస్థలు వర్గ దృక్పథం ఎందుకు పోషిస్తున్నాయి? ‘నీవు చెప్పేదానిలో ఒక్కమాటనూ నేను అంగీకరించను. కానీ ఆ మాట చెప్పడానికి నీకు గల హక్కును ప్రాణమిచ్చి అయినా కాపాడుతాను’ అన్న వోల్టేర్ మాటనైనా అకాడమీ గౌరవించాలి కదా! వామపక్షేతర సిద్ధాంతానికి మీరు చెప్పే ‘భావస్వేచ్ఛ’లో ఎందుకు స్థానం లేదో మేధావిగా ఎస్వీ ఆలోచించాలి. జాతీయవాద ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేండ్లయినా దాని కర్రపెత్తనం అకాడమీపై పడకపోవడం హర్షణీయం అన్నారు ఎస్వీ. ఇలా అకాడమీని లెఫ్ట్​వింగ్ ఆక్రమించిందని వారు ఒప్పుకొంటూనే జాతీయవాద భావజాలానికి అలాంటి దురాక్రమణ మనస్తత్వం లేదనీ చెప్పేశారు. మరి రోజూ ‘మాకు స్వేచ్ఛ లేదు’ అని ఎందుకు నిందిస్తున్నారు? సాధారణంగా బయట సంస్థలు ఇచ్చే అవార్డులను గురించి ఎవరికీ పట్టింపు లేదు. వేల కోట్ల బడ్జెట్ తో నడిచే రాజ్యాంగబద్ధ సంస్థ ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తే ప్రశ్నించడం నేరమా? సాహిత్య రంగంలో సామాజిక దృష్టి కొరవడటం, వర్గ దృష్టి, అకవిత్వ సృష్టి, వ్యతిరేక ధోరణి కవిత్వం, ఉద్దేశపూర్వక విస్మరణ, పట్టు పరిశ్రమ, హిపోక్రసీ వంటివి ఎందుకు పెరిగిపోయాయో ‘ఎస్వీ’ లాంటి గొప్ప రచయిత ఒక్కసారి మననం చేసుకోవాలి. సాహిత్య రంగంలో ‘ఉన్నదాన్ని విమర్శించడం -లేనిదాన్ని రుద్దడం’ జరుగుతున్న ఈ తరుణంలో అకాడమీ ముందుకు వచ్చి దేశంలో ‘జాతీయ సమైక్యత’కు కృషి చేయాల్సిన అవసరం లేదా?

ద్వేషం కోసమా.. దేశం కోసమా..

75 ఏండ్లు గొప్ప ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మిలిట్రీ రూల్ తో అధికారంలోకి వచ్చిందా? లెఫ్ట్ వాళ్లు ఉండడాన్ని నేను ఎక్కడా, ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ‘లెఫ్ట్ వాళ్లు మాత్రమే ఉండాలి’ అనుకోవటం తప్పు అంటున్నాను. ద్వేషం కోసం ఈ వర్గాలు ఆలోచిస్తే మేం దేశం కోసం ఆలోచిస్తాం. అకాడమీ కూడా ఇందుకు అతీతంగా ఉండొద్దు. అంతా పారదర్శకంగా జరుగుతుందని ఎస్వీ చెప్పుకున్నారు. ఈ సంగతులు ఎస్వీకి ఎలా తెలుసు? అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుల నియామకాలు ప్రపోజ్ చేస్తున్న సంస్థలు, రాష్ట్రాల సాంస్కృతిక శాఖలు, విశ్వవిద్యాలయాలు వంటివన్నీ  ఏ పద్ధతిలో ఎంపిక చేస్తాయో తెలుసు. 2013 తెలుగు సాహిత్య పురస్కారం పొందిన కాత్యాయనీ విద్మహే మార్క్సిస్టు దృక్పథం గల రచయిత్రి అని అందరికీ తెలుసు. ఏ జ్యూరీ సభ్యులు ఆమెకు అవార్డు ఇచ్చారో, ఆ తర్వాత వరుసగా మూడేండ్లు తెలుగు సలహా సంఘ సభ్యులకు పురస్కారాలు ఎలా వచ్చాయో అన్నది ఒక ఉదాహరణ. అక్కడంతా గొప్పగా ఉందని ఎస్వీ ప్రస్తావించినందుకు నేనీ విషయం చెప్పాల్సి వచ్చింది. విశ్వవిద్యాలయ వ్యవస్థలో ఉన్న ఎస్వీకి ఇవన్నీ తెలుసు కాబట్టే వారు కితాబిచ్చారు.

అందరినీ ఆదరించాలి

‘భావజాలాన్ని బట్టి అవార్డులు రావు’ అని ఎస్వీ  అన్నారు.  భావజాలం పేరుతో అవార్డులు ఇవ్వకూడదని, అస్మదీయ, తస్మదీయ పరిగణన కూడదని నేనూ కోరుతున్నాను.  ‘వీరు కమ్యూనిస్టులు అయినందున కవులు కారు అనగలమా?’ అని ఎస్వీ అన్నారు. మరి జాతీయవాదులు అయినందున అవార్డులు ఇవ్వకపోవడం సబబా? అని నేను అడగడంలో తప్పేముంది! సమన్యాయం జరగాలని కోరడం ‘కాకి గోల’ ఎలా అవుతుందో సంస్థాగతంగా ఎంతో అనుభవం ఉన్న ఎస్వీ ఆలోచించాలి. ప్రజల పన్నులతో నడిచే అకాడమీ ఇలాగే ఆశ్రిత పక్షపాతం చూపితే భవిష్యత్ లో  సాహిత్య రంగంలో తుపాకులు తప్ప రసం పుట్టదు. అందరి కోసం ఉండాల్సిన అకాడమీ కొందరి కోసమే ‘రెడ్ కార్పెట్’ పరిస్తే ప్రశ్నించడం అక్కసా! అకాడమీ అందరినీ ఆదరిస్తే, వ్యక్తులు కాదు సాహిత్యం సదా జీవిస్తుంది.

ప్రధానిని నిందిస్తారా..

ఇక ఎస్వీ ‘అవాకులు, చవాకులు' అంటూ నేను వాడిన కొన్ని పదాలను ఆక్షేపించారు. నిజానికి పడికట్టు పదాల సృష్టికర్తలు వామపక్షవాదులే. వాళ్లు ఈ దేశాన్ని, సంప్రదాయ సాహిత్యాన్ని తిట్టిన తిట్లు చెబితే కొండవీటి చాంతాడంత అవుతుంది. కానీ నా వ్యాసంలో నేను వాచ్యార్థంలో అర్థం చేయించేందుకు చెప్పినవే తప్ప ఇతరులను నిందించే ఉద్దేశం నాకు లేదు.   మధురాంతకం రాజారాం దేశభక్తుడిగా ఉంటే అవార్డు రాదు. వామపక్షవాదిగా మారగానే అవార్డుల పంట పండుతుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే.  ‘మార్క్సిజం ఓ జ్ఞాన సిద్ధాంతం. వామపక్ష మేధావుల విస్తరణ అన్ని రంగాల్లో జరగడం గొప్ప విషయం’ అని ఎస్వీ చెప్పుకున్నారు. అవును! మెక్సికోలో వెంటాడి ట్రాట్స్కీని వేటేయగలరు.  మోడీ ప్రధాని అయితే నేను ఈ దేశంలో ఉండనే ఉండను అని యూఆర్ అనంతమూర్తి ప్రకటించగలడు. నయనతారా సెహగల్ మొదలుకొని గిరీశ్ కర్నాడ్ వరకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన దేశ ప్రధానిని నిందించగలరు.  అది ప్రగతిశీల ప్రజాస్వామ్య దృష్టేనా?  ఒకప్పుడు అకాడమీ నడిపే ‘ఇండియన్ లిటరేచర్’ పత్రికలో సంపాదక ప్రముఖుడు అసంబద్ధంగా రామాయణాన్ని విమర్శిస్తాడు. అదే విమర్శ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో  పుస్తకం​ఎలా అయ్యింది? ఇదంతా భారతీయతా? విదేశీ మనస్తత్వమా? ఎస్వీ ఆలోచించాలి. - డా. పి. భాస్కర యోగి, రాజకీయ, సామాజిక విశ్లేషకులు