అప్పులపై గరం గరం: అసెంబ్లీలో భట్టి , హరీశ్ నడుమ మాటల యుద్ధం

అప్పులపై గరం గరం: అసెంబ్లీలో భట్టి , హరీశ్ నడుమ మాటల యుద్ధం
  • ఏడాదిలోనే ఈ సర్కారు 1.27 లక్షల కోట్ల అప్పు చేసింది.. మేం 7 లక్షల కోట్ల అప్పు చేశామనడం పచ్చి అబద్ధం
  • ఆర్బీఐ లెక్కల ప్రకారం మేం చేసిన అప్పు 4. 17 లక్షల కోట్లే
  • ప్రివిలేజ్ ​మోషన్​కు అనుమతించండి
  • మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మేం చేసిన అప్పు 55,277 కోట్లే
  • 11 నెలల్లో మీ పాత అప్పులకు కిస్తీలే 66 వేల కోట్లు చెల్లించినం
  • 40 వేల కోట్ల పెండింగ్​ బకాయిలు పెట్టి నీతులు చెప్తరా?
  • చర్చకు మేం సిద్ధమే.. రూపాయితో సహా లెక్కకట్టి చూపిస్తం

హైదరాబాద్, వెలుగు:  పదేండ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏడాది పాలనలో ప్రస్తుత కాంగ్రెస్​ సర్కారు చేసిన అప్పులపై అసెంబ్లీలో మంగళవారం వాడీవేడి చర్చ జరిగింది.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  వర్సెస్​  బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్​​రావు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అప్పులపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం ఒకదశలో తారస్థాయికి చేరింది. కాంగ్రెస్​ సర్కారు ఏడాది పాలనలో చేసిన  అప్పు అక్షరాలా 1.27 లక్షల కోట్లు అని హరీశ్ రావు​ అంటే.. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా తాము చేసిన అప్పు రూ.55,277 కోట్లే అని భట్టి చెప్పారు. 

‘‘ఆర్బీఐ లెక్కల ప్రకారం బీఆర్ఎస్​ హయాంలో చేసిన అప్పు రూ.4 లక్షల17 వేల 496 కోట్లే. కానీ మా ప్రభుత్వం  రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కాంగ్రెస్​ చేస్తున్న ప్రచారం  పచ్చి అబద్ధం” అని హరీశ్​రావు పేర్కొన్నారు. ‘‘అప్పులు కాదు.. మీరు పెట్టిన బకాయిలే రూ.40 వేల కోట్లు ఉన్నయ్.. వాటిని దఫదఫాలుగా క్లియర్​చేస్తున్నాం.. తెచ్చిన అప్పుల్లో బీఆర్ఎస్​ హయాంలో చేసిన పాత బాకీలకు కిస్తీలు, వడ్డీలే ఈ 11 నెలల్లో రూ.66 వేలకోట్లు చెల్లించాం’’ అని భట్టి విక్రమార్క కౌంటర్​ ఇచ్చారు. అప్పులపై ఒక రోజు స్పెషల్ డిబేట్ పెట్టాలని  హరీశ్​ రావు డిమాండ్​ చేయగా.. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్  సిద్ధమా?’’ అని భట్టి సవాల్ విసిరారు. అందుకు హరీశ్​ సైతం సై అన్నారు. భట్టి సవాల్‌‌ను స్వీకరిస్తున్నామని హరీశ్​ ప్రకటించారు.

ఎఫ్ఆర్​బీఎం రుణాలపై అసెంబ్లీలో రచ్చ..

మంగళవారం ఉదయం అసెంబ్లీ మొదలవగా.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌‌ఆర్‌‌బీఎం రుణాలపై మాజీ మంత్రి హరీశ్​రావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. 2024 నవంబర్ వరకు ఎఫ్ఆర్​బీఎం పరిధిలో రూ.52,118 కోట్లు, కార్పొరేషన్లు, ఎస్ పీవీల ద్వారా  (ఎఫ్ఆర్​బీఎం యేతర రుణాలు) రూ.61,991.14 కోట్లు తీసుకున్నామన్నారు.  ‘మేం అప్పుల విషయంలో పారదర్శకంగా ఉన్నాం.. ఆర్ బీఐ అనుమతితో తెచ్చిన ప్రతి అప్పు లెక్క చెప్తున్నాం.. మీలాగా రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి దాచిపెట్టలేదు” అని భట్టి అన్నారు. దీనిపై హరీశ్​రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రూ.7 లక్షల కోట్ల అప్పు అవాస్తవం: హరీశ్​ రావు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన ప్రకారమే ఎఫ్ఆర్​బీఎం పరిధిలో చేసిన అప్పులు రూ.55,277 కోట్లని హరీశ్​రావు పేర్కొన్నారు. కార్పొరేషన్​ గ్యారంటీల కింద తెచ్చిన అప్పులు రూ.61,991 కోట్లు అని, గ్యారంటీ లేకుండా చేసిన అప్పులు రూ.10,099 కోట్లు.. మొత్తంగా ఏడాది పాలనలో కాంగ్రెస్​ సర్కారు లక్షా 27వేల 208 కోట్ల అప్పులు చేసిందని  చెప్పారు. అంటే వచ్చే ఐదేండ్లలో కాంగ్రెస్​ పార్టీ చేయబోయే అప్పులు రూ.6 లక్షల 36 వేల 400 కోట్లు అని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్​ ప్రభుత్వం అసెంబ్లీలో వైట్​పేపర్​ పెట్టినప్పుడు గత10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులు  రూ.6 లక్షల71 వేల757  కోట్లు అన్నరు. బహిరంగ సభల్లో సీఎం సహా మంత్రులు రూ.7 లక్షల కోట్లు అంటున్నరు.

ఈరోజు డిప్యూటీ సీఎం రూ. 7 లక్షల11 వేల911 కోట్ల అప్పు అంటున్నరు. డిప్యూటీ సీఎం ఇలా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.  కానీ ఇవేవీ వాస్తవం కాదు. బీఆర్ఎస్​ హయాంలో చేసిన  అప్పు రూ. 4 లక్షల 17 వేల496 కోట్లు మాత్రమే.   ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రచారం అంతా తప్పు’’ అని హరీశ్​రావు పేర్కొన్నారు.   ‘గోరంతలు కొండంతలు చేశారు. గోబెల్స్​ ప్రచారం చేశారు. నేను ఈ హౌస్​లో చాలెంజ్ చేస్తున్నా..  అప్పులపై ఒకరోజు స్పెషల్ డిబేట్  పెట్టండి. ఆడిటర్లను, ఫైనాన్స్ నిపుణులను పిలిచి చర్చించండి.

దీన్ని నేను ప్రూవ్​ చేస్తాను’’ అని సవాల్​ విసిరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నందునే  భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్​విమర్శించారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్​చేశారు.

మేం మీలా ఔటర్​ను 30 ఏండ్లకు అమ్ముకోలే: భట్టి

హరీశ్​రావుకు ఎప్పటికీ నిజం చెప్పే అలవాటు లేదని, ఆయనకు రాజకీయం చేసే అలవాటు మాత్రమే ఉన్న దని భట్టి విమర్శించారు. ఎఫ్ఆర్​బీఎం పరిధిని దాటి తాము ఎలాంటి అప్పులు చేయలేదన్నారు. గడిచిన పదేండ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ఒక సంవత్సరంలో చక్కబెట్టలేకే కొంత అప్పులు చేస్తున్న విషయం వాస్తవమని అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఔట ర్ రింగ్ రోడ్డు ను 30 ఏండ్ల కాలానికి బీఆర్ఎస్ నేతలు అమ్ముకొని  సొమ్ము చేసుకున్నారు’’ అని భట్టి ఆరోపించారు. వారి తరహాలో తాము కొన్నింటిని 30 ఏండ్లకు ఇప్పుడే అదానీ, అంబానీకి అమ్ముకుంటే.. వచ్చే ప్రభుత్వాలు ఎలా పాలన సాగిస్తాయని ప్రశ్నించారు.

స్పీకర్ ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లో ఉండరా?:హరీశ్​

ప్రశ్నోత్తర సమయంలో స్పీకర్​ ప్రశ్న చదివినప్పుడు సీట్లో మంత్రి భట్టి లేకపోవడంపై హరీశ్​రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘నేను 21 ఏండ్లుగా సభలో ఉన్నా. మంత్రిగా పనిచేశా. ప్రతిపక్షంలో ఉన్నా. కానీ, స్పీకర్  ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లో లేకపోయిన సంద ర్భం ఇదొక్కటే. సభలో ప్రశ్నోత్తరాలు ఉన్నప్పుడు భట్టి సభలో లేకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత ప్రభుత్వం చేసిన అప్పులు అని తప్పుడు ప్రచారం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ లెక్కలు ఆర్బీఐ  ప్రకటించినవి. ఆర్థిక విషయాల్లో ఆర్బీఐ  కంటే గొప్పవాళ్లు ఎవరు ఉంటారు? 2 సార్లు కరోనా రావడం, దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం వల్లే ఆ అప్పులు అయ్యాయి. రాష్ట్రాలు 1.75 శాతం అదనంగా అప్పు లు తీసుకొని క్యాపిటల్ ఎక్స్​పెండిచర్​చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకే చేయాల్సి వచ్చింది’’ అని హరీశ్ రావు వివరించారు. 

డిస్కంలకు డబ్బులు ఇవ్వలే: భట్టి 

పదేండ్లలో గత సర్కారు డిస్కంలకు కూడా భారీగా బకాయిలు పెట్టిందని భట్టి మండిపడ్డారు.‘‘రైతులకు ఉచిత విద్యుత్​ కాంగ్రెస్ పేటెంట్.  2004లో ఈ స్కీమ్​ను మా ప్రభుత్వం ప్రారంభించి ఎప్పటికప్పుడు డిస్కంలకు బకాయిలు చెల్లించేది. కానీ, గడిచిన పదేండ్లలో  గత ప్రభుత్వం డిస్కంలకు  రూ.18 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక  వ్యవసాయానికి ఉచిత విద్యుత్​కు రూ.11 వేల కోట్లు చెల్లించాం. పేదలకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ బకాయిలను నెలనెలా చెల్లిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో​ పరిశ్రమల శాఖలోనూ3వేల  కోట్ల బకాయిలు పెట్టి పోయారు”  అని పేర్కొన్నారు. 

పేద పిల్లల మెస్​చార్జీలూ బకాయి పెట్టిన్రు: భట్టి

బీఆర్ఎస్  సర్కారు హయాంలో పేద పిల్లల మెస్​చార్జీ లు కూడా బకాయి పెట్టారని  భట్టి మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ పాలకులు కాంట్రాక్టర్లకు ప్రతి ఏటా పెరిగిన ధరలకు తగ్గట్టుగా ఎస్కలేషన్​ పెంచి బిల్లులు చెల్లించేవారు. పేద బిడ్డలు చదువుకునే వసతి గృహాల్లో మెస్ చార్జీలు మాత్రం ఒక్క రూపాయి పెంచలేదు. భోజనాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టిపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లు సరుకులు ఇవ్వక, సరైన  ఆహారం అందక స్టూడెంట్లు రోగాలబారిన పడ్తున్నారు.

దీంతో  మేం  ఒకేసారి 40 శాతం మెస్ చార్జీలు, 200 శాతానికి పైగా కాస్మోటిక్స్ చార్జీలు పెంచాం. మీరు వదిలిపెట్టి పోయిన బకాయిలను అణాపైసలతో సహా చెల్లిస్తున్నాం. అదీ మా నిబద్ధత’ అని భట్టి వెల్లడించారు. బిల్లులు పెండింగ్​ పెట్టి.. ఇప్పుడు తగదునమ్మా అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్​కు నిజాలు మాట్లాడే అలవాటు లేదని, కానీ శాసనసభ వ్యవహారాల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడితే ఎలా? అని నిలదీశారు. ‘‘అప్పుల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. చేసిన అప్పులను దాచే పరిస్థితి లేదు.

నిజాలు చెప్తే ప్రివిలేజ్ మోషన్ అంటే ఊరుకోవాలా? ప్రతి 6 నెలలకు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మైండ్ పోతున్నది.  ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వాళ్లలో మార్పు రావడం లేదు. అప్పులు, ఆస్తుల విషయంలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీశ్​రావు సవాళ్లు స్వీకరిస్తున్నా. చర్చకు నేను రెడీ’’ అని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మాపై ప్రివిలేజ్​మోషన్​ ఇస్తారా?: భట్టి

బీఆర్‌‌ఎస్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌‌పై భట్టి మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులా మాపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది? బీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. గడిచిన పదేండ్లు బీఏసీ ఎలా నిర్వహించారో మర్చిపోయారా? గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడూ పాటించాలి కదా? ఎవరైనా రూల్స్ బుక్ ప్రకారమే నడవాలి’’ అని మంత్రి భట్టి అన్నారు.  బీఆర్ఎస్ నేతలది భూస్వామ్య మనస్తత్వమని, తనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారని భట్టి ప్రశ్నించారు.

‘‘ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు నేను రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్తే  భూమిలేని నిరుపేద కూలీలకు ఏమీ ఇవ్వరా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించాడు. ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించాను. పేదలకు ఇవ్వాలనుకోవడం తప్పా? వారికి ఇవ్వొద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారా?’’ అంటూ భట్టి నిలదీశారు. 

ప్రివిలేజ్​ మోషన్​పై తప్పుదోవ పట్టించొద్దు: హరీశ్​

రేవంత్ ప్రభుత్వంపై తాము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ అనుమతించాల్సిందేనని హరీశ్​రావు పట్టుబట్టారు. ‘‘భట్టిపై  ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చా మో స్పీకర్  క్లారిఫై చేయాలి. విక్రమార్క మధిరలో మాట్లాడిన దానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర అప్పులపై తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని మేం ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. వ్యవసాయ కూలీలకే కాదు.. 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.

నేను భట్టి  సవాల్​ను స్వీకరిస్తున్నా. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి మేం సిద్ధం’’ అని  హరీశ్​అన్నారు.  సమావేశాలు ముగిసేలోపైనా అప్పులపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రభుత్వం చెప్తున్న అప్పులకు, వాస్తవ అప్పులకు తేడా ఉందని హరీశ్ ​ఆరోపించారు. 

రాష్ట్ర అప్పులపై తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తున్నం. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టిపై ప్రివిలేజ్ మోషన్పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి.  ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికిమేం సిద్ధం. - హరీశ్​రావు 

గడిచిన పదేండ్లలో బీఏసీ ఎలా నిర్వహించారో మర్చిపోయారా? గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడూ పాటించాలి కదా? బీఆర్ఎస్ నేతలది భూస్వామ్య మనస్తత్వం. నాపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారు? రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నందుకా? - భట్టి