
జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ ఘటనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు డీజీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు గడ్డం జలపతి రెడ్డి బలవన్మరణానికి కారణమైన న్యాయవాది కే.దామోదర్ రావు పై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బలవన్మరణం పై జగిత్యాల రూరల్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదై 9 రోజులు గడిచినా.. ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయలేదని చెప్పారు. న్యాయవాది కే దామోదర్ మానసిక హింస వల్లనే.. జలపతి రెడ్డి సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. రైతు రాసిన సూసైడ్ లెటర్‌తో పాటు సెల్ఫీ వీడియో తీసుకున్న విషయాన్ని డీజీపీకి చెప్పారు. అలాగే.. జలపతి రెడ్డి ఆత్మహత్యకు ముందు తనకున్న ఇద్దరు ఆడపిల్లలను వ్యవసాయ బావిలో పడేసిన ఘటనను అంజనీ కుమార్‌కు వివరించారు.
రైతు జలపతి రెడ్డి ఘటనపై జగిత్యాల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సూసైడ్ లెటర్, వీడియో క్లిప్పింగ్‌ను డీజీపీకి అందజేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని భట్టి, జీవన్ రెడ్డిలు తెలిపారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని డీజీపీ భరోసా ఇచ్చినట్టు వెల్లడించారు.