బీజేపీ జిమ్మిక్కులను ప్రజలు తిప్పికొట్టారు: భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమిపై నమ్మకంతోనే జార్ఖండ్ ప్రజలు పట్టం కట్టారని ఏఐసీసీ అబ్జర్వర్, ఆ రాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ భట్టి విక్రమార్క అన్నారు. సమిష్టి కృషితోనే ఇక్కడ విజయం సాధించామన్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో ఎన్నికల ఫలితాల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు. అక్కడ తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. వారి కొనుగోలు జిమ్మిక్కులను ఇక్కడి ఎమ్మెల్యేలు, ప్రజలు తిప్పికొట్టారన్నారు. తమ ఎమ్మెల్యేలు పార్టీ పట్ల, పార్టీ భావజాలం పట్ల పూర్తి కమిట్మెంట్ తో ఉన్నారని స్పష్టం చేశారు.

‘‘జార్ఖండ్ మైన్స్, మినరల్స్ ఆ రాష్ట్ర ప్రజలకే చెందాలి. అట్లా కాకుండా అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేశాం. మా నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇక్కడి ఎన్నికల ప్రచారంలో ఒకటే మాట చెప్పారు.. సంవిధాన్ సమ్మేళన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ దాని ద్వారా వచ్చిన హక్కులను కాపాడుతామని ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంపద, ఆస్తులు సమానంగా చెందాలని మన భారత రాజ్యాంగం చెప్తున్న విషయాన్నే మా హైకమాండ్ ఇక్కడి ప్రజలకు వివరించింది. ప్రజలు దీన్ని విశ్వసించి గెలిపించారు”అని భట్టి అన్నారు. 

జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులు,  మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో బడ్జెట్ అంకెలు, సంఖ్యలతో వివరంగా చెప్పామని, తమ కూటమి నేతల మాటలను ప్రజలు నమ్మడంతోనే ఫలితాలు తమకు పూర్తి అనుకూలంగా వచ్చాయన్నారు. రాహుల్ గాంధీ, సోరేన్ వంటి యువ నాయకులు, ఖర్గేలాంటి అనుభవం కలిగిన వ్యక్తుల సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు ఉంటే అనుకున్న అభివృద్ధి జరుగుతుందన్నారు.