నైనీ కోల్​ బ్లాక్ ఓపెనింగ్​కు సహకరించండి : భట్టి విక్రమార్క

నైనీ కోల్​ బ్లాక్ ఓపెనింగ్​కు సహకరించండి : భట్టి విక్రమార్క
  • ఒడిశా సీఎం మాఝీకిడిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
  • సానుకూలంగాస్పందించిన మాఝీ
  • 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే చాన్స్​

హైదరాబాద్, వెలుగు : ఒడిశాలో 2015లో సింగరేణికి కేటాయించిన నైనీ కోల్​బ్లాక్​ ప్రారంభానికి సహకరించాలని ఆ రాష్ట్ర సీఎం మోహన్​ చరణ్​ మాఝీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.  రోడ్లు, ఇతర మౌలిక సదుపా యాలు కల్పిస్తే బొగ్గు తవ్వకాలు చేపడ్తామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి  అధికారుల బృందంతో కలిసి భువనేశ్వర్​లోని ఆ రాష్ట్ర సెక్రటేరియట్​లో ఒడిశా సీఎం మోహన్‌‌‌‌ చరణ్‌‌‌‌ మాఝీతో శుక్రవారం భేటీ అయ్యారు.  నైనీ కోల్​బ్లాక్​పై చర్చలు జరిపారు. కాగా, ఈ కోల్​ బ్లాక్​​ ప్రారంభానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఒడిశా సీఎం స్పష్టం చేశారు.

మాఝీ సానుకూల స్పందనతోపాటు అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లడంతో సింగరేణి నైనీ నుంచి మరో మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి చూపుతున్న చొరవపై సింగరేణి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సింగరేణి మనుగడకు అత్యంత ఆవశ్యకం

 2015 లోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారని, మైనింగ్​కు ఇండస్ట్రియల్, ఎన్విరాన్​మెంటల్​ అనుమతులు కూడా వచ్చాయని భట్టి తెలిపారు.  అటవీ, ప్రైవేట్​ భూముల ట్రాన్స్​ఫర్​ పెండింగ్​లో పడిందని,  వాటిని సింగరేణికి బదలాయిస్తే  మైనింగ్​ ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే, కరెంట్, రోడ్లు, ఇతరమౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

నైనీ బ్లాక్ లో  తవ్వకాలు చేపడితే ఒడిశా యువతకు ఉపాధితో పాటు  ఆ ప్రభుత్వానికి ఏటా రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఒడిశా సీఎంకు వివరించారు. దేశంలో కరెంటు ఉత్పత్తికి, సింగరేణి మనుగడకు నైనీ మైన్స్​ అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను​ ఒడిశా సీఎం మాఝీకి  అందజేశారు. స్పందించిన మాఝీ.. భూముల బదలాయింపు, కరెంట్, రోడ్ల  సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు భట్టి వెల్లడించారు. 

స్థానిక ఎమ్మెల్యేతో కలిసి నిర్వాసితులతో భేటీ

ఒడిశా సీఎం మోహన్ మాఝీతో భేటీ ముగిసిన అనంతరం రాజధాని భువనేశ్వర్ కు 140 కిలోమీటర్ల దూరంలో  ఉన్న  నైనీ ప్రాంతానికి డిప్యూటీ సీఎం భట్టి రోడ్డు మార్గంలో తన బృందంతో కలిసి చేరుకున్నారు. నైనీ బొగ్గు బ్లాకు ప్రదేశాన్ని, రవాణా సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్ట్​ వివరాలను సింగరేణి సీఎండీ బలరాం ఆయనకు వెల్లడించారు. ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో నైనీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ (ఛెండిప‌‌‌‌డ‌‌‌‌) ఎమ్మెల్యే అగస్తి బెహరాని డిప్యూటీ సీఎం భట్టి  కలిశారు.

తన తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున పూర్తి సహకారం అందిస్తామని బెహరా పేర్కొన్నారు. ఈ సంద‌‌‌‌ర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగ‌‌‌‌రేణి సంస్థ చేప‌‌‌‌ట్టే మైనింగ్ వ‌‌‌‌ల్ల స్థానికుల‌‌‌‌కు ఉపాధితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి రాయ‌‌‌‌ల్టీ, డివిడెండ్ రూపంలో కోట్ల రూపాయ‌‌‌‌ల ఆదాయం వ‌‌‌‌స్తుంద‌‌‌‌ని భ‌‌‌‌రోసా ఇచ్చారు. భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలను నైనీ ప్రాంతంలో అక్కడి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నిర్వాసితులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్య చర్చించారు.