- రఘురాంరెడ్డి గెలుపుతోనే ఖమ్మం అభివృద్ధి
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి
మధిర/ఎర్రుపాలెం, వెలుగు : పదేండ్లుగా బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అడ్గగోలుగా దోచుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రఘురాంరెడ్డి గెలుపుతో ఖమ్మం అభివృద్ధి పరుగులు పెట్టనుందని తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా మధిరలో, ఎర్రుపాలెంలోని రింగ్ రోడ్డు వద్ద నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో వారు మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
డ్వాక్రా మహిళలకు ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. చివరి మండలంగా ఉన్న ఎర్రుపాలెంను రెండవ జోన్ కు మార్చి సాగర్ నీళ్లు పారిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు లక్ష కోట్లు పావలా వడ్డీ రుణాలను అందిస్తామన్నారు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఇందిరా డైయిరీని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని, కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.
సీఎంగా పనిచేసిన వ్యక్తి కేసీఆర్ మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు క్షమించరని, కేసీఆర్ భాష మార్చుకోవాలన్నారు. ఫాం హౌస్ లో ఉండి కేసీఆర్ ఇంకా తానే సీఎంగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రుపాలెం మీటింగ్‌లో వివిధ పార్టీల జెండాలను చూసిన వారు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, జనసేన అన్నీ ఒకవైపు నిలబడిన తర్వాత ఫలితం వన్ సైడ్ కానుందని తెలిపారు.