మూసీ నిర్వాసితులకు అద్భుతమైన లైఫ్ ఇస్తం: డిప్యూటీ సీఎం భట్టి

మూసీ నిర్వాసితులకు అద్భుతమైన లైఫ్ ఇస్తం: డిప్యూటీ సీఎం భట్టి
  • అభివృద్ధిని చూసి తట్టుకోలేకే కొందరు విషప్రచారం చేస్తున్నరు
  • నరెడ్కో ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం
  • ప్రభుత్వ ఆస్తులను హైడ్రా రక్షిస్తుందని హామీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ సిటీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని కొందరు వ్యక్తులు కావాలనే విషప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. హైదరాబాద్​లోని హైటెక్స్​లో నరెడ్కో ప్రాపర్టీ షోను శనివారం భట్టి ప్రారంభించి మాట్లాడారు. మూసీ నిర్వాసితులకు వారు ఉండే చోటే అద్భుతమైన టవర్లు నిర్మిస్తామని, వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్  స్కూల్స్  కట్టిస్తామని తెలిపారు.

మూసీ నిర్వాసిత మహిళలతో పాటు హైదరాబాద్ నగరంలోని డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. అనంతరం నరెడ్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను భట్టి సందర్శించారు. ఈ సందర్భంగా స్థిరాస్తి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైడ్రాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఉన్న నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. హైడ్రా అనుమతులు ఇవ్వదన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీ వంటి  ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇస్తాయన్నారు. 

భవిష్యత్​ హైదరాబాద్దే
దేశంలో భవిష్యత్తు హైదరాబాద్​దే అని భట్టి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్, 30 వేల ఎకరాల్లో అద్భుతమైన ఫ్యూచర్  సిటీని నిర్మిస్తున్నామని, ఎయిర్ పోర్టు నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చని తెలిపారు. అక్కడ ప్రపంచ స్థాయి వర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఏఐ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్​గా ఉంటుందని వెల్లడించారు. రియల్టర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై మట్లాడామని, త్వరలో ఎస్ఎల్బీసీ సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల మూలంగా రిజిస్ట్రేషన్లలో స్తబ్ధత ఏర్పడిందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయన్నారు.

ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తుందని జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులను రెండు వారాల్లోగా క్లియర్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కో చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.