సూర్యాపేట/నకిరేకల్, వెలుగు : తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చకుండా పదేళ్ల నుంచి రాష్ట్ర సంపదను దోచుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి నుంచి సూర్యాపేట నియోజకవర్గంలోని వేదిరేవారి గూడెంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లాకు ఒక్క ప్రాజెక్టు తేలేదన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్, ఎస్సెల్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు పూడిక తీసే దిక్కు లేదని, కనీసం కాల్వల రిపేర్లు చేయలేదని మండిపడ్డారు.
కాగా సూర్యాపేట కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. భట్టి యాత్ర సూర్యాపేటకు ఎంటర్ కాగానే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో భట్టికి రమేశ్‌రెడ్డి స్వాగతం పలికేందుకు పూల దండా వేసేందుకు ప్రయత్నించగా దామోదర్ రెడ్డి వర్గం ఒక్కసారిగా ‘జై దామన్న’ అంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, నాయకులు చకిలం రాజేశ్వరరావు, కోతి గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బైరు శైలేందర్, పద్మ, తండు శ్రీనివాస్ యాదవ్, చెంచాల శ్రీను, నరేందర్ నాయుడు, ముషం రవి, అనుములపూడి రవి బాబు తదితరులు పాల్గొన్నారు.