- కక్ష సాధింపు అనడం అవగాహనా రాహిత్యమే: డిప్యూటీ సీఎం భట్టి
- అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి కోరడంతోనే న్యాయ విచారణ
- త్వరలో కరెంటుపై గ్రామసభలు నిర్వహిస్తామని వెల్లడి
- మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం/మధిర, వెలుగు: విద్యుత్ రంగ పరిస్థితిపై కక్షసాధింపు ధోరణితో న్యాయ విచారణ చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే వారిది అవగాహనా రాహిత్యమే అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విచారణకు కేసీఆర్ రాకపోతే న్యాయవ్యవస్థే చూసుకుంటుందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలంలో ఆదివారం పలు గ్రామాల్లో రోడ్లు, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరపాలని విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని, ఆయన కోరిన మేరకే జ్యుడీషియల్ ఎంక్వయిరీకి తమ ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే కక్షసాధింపు ధోరణి అంటున్నారని ఎద్దేవా చేశారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనుభవం కలిగిన వారని తెలిపారు. ‘విచారణకు హాజరుకాము, నేను చెప్పిందే వేదం, శాసనం అంటే’ వారికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లు భావిస్తున్నామని చెప్పారు. ‘‘విచారణకు ఆదేశించడం వరకే ప్రభుత్వం పని. ఎలా విచారిస్తారో, ఎవరెవరిని పిలుస్తారో మాకు తెలియదు. విద్యుత్ రంగ పరిస్థితిపై మా ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీలో వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం ద్వారా చర్చకు పెట్టాం. అప్పుడు చర్చలో పాల్గొన్న విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్తు కొనుగోలు అంశంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు వెంటనే ప్రకటించారు. ఈ విషయాలన్నీ అసెంబ్లీలో రికార్డు అయి ఉన్నాయి” అని భట్టి తెలిపారు.
కరెంటు పోతే 1912కు ఫోన్ చేయండి
గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో ఎవరికి, ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సమస్య ఎదురైతే 1912 నంబర్ కు ఉచితంగా ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు.
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళిస్తం
గత పదేండ్ల పాటు రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జమాబందీ లేదని, కొద్దిమంది పెద్దలకు ప్రయోజనం చేకూర్చేందుకు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని భట్టి అన్నారు. పార్ట్ -బీలో పెట్టినవి అపహరించేందుకు వెసులుబాటు కల్పించారని చెప్పారు. ధరణి సమస్యలపై నిర్ణయం తీసుకుంటామని గతంలోనే చెప్పామని, దానిపై కమిటీ కూడా వేశామని, ఆ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత వాటిని ప్రజల ముందు పెడతామని ఆయన వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు.