కాళేశ్వరం లేదు.. నీళ్లు లేవు..లక్షల కోట్లు సీఎం ఆగం చేసిండు : భట్టి విక్రమార్క

ముదిగొండ, వెలుగు : తెలంగాణ ప్రజల సంపదతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నానంటూ సీఎం కేసీఆర్  మాయమాటలు చెప్పి రూ.లక్షల కోట్లు గోదాట్లో పోశాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం లేదు, నీళ్లు లేవని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని యడవల్లి గ్రామంలో  యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. యడవల్లి నుంచి లక్ష్మీపురం, మేడేపల్లి, ధనియలాగుడెం, కట్టకూరు, సీతారాంపురం, మాదాపూరం గ్రామాల్లో ఆయన మాట్లాడారు. ధనియాలగూడెంలో మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. కాళేశ్వరం డిజైన్ సక్రమంగా లేదని, నిర్మాణం అవకతవకలతో జరుగుతున్నదని తాము ముందే చెప్పామన్నారు.

ఇంజినీరింగ్  అధికారులు చెప్పినా సీఎం వినలేదని ఫైర్  అయ్యారు. ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిలైందన్నారు. ప్రాజెక్టును ఇష్టారీతిన డిజైన్  చేసి కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్  ఇచ్చి పరోక్షంగా బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్  కుటుంబానికి ఏటీఎంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్నారని,  అయినా కేసీఆర్‌‌‌‌ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్  నేతలు కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.