ధరణి పేరుతో భూములు దోచుకున్నరు..ఉద్యోగాల్లేవు..5 లక్షల కోట్లు అప్పు

రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ ది చేతల ప్రభుత్వం కాదు..కేవలం మాటల ప్రభుత్వం అని మండిపడ్డారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్న ప్రజలు..కేసీఆర్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రావడం లేదని..సంపద పోయిందని ఆరోపించారు. కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో పంచిన 24 లక్షల ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. ధరణి పేరుతో సీఎం కేసీఆర్ భూములు దోచుకున్నారని మండిపడ్డారు. ధరణిపై వ్యతిరేకంగా పోరాడేందుకు రైతులు సిద్దంగా ఉన్నారని తెలిపారు. 

అధికార మదంతో విర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా పీపుల్స్ పాదయాత్ర చేశానని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు.  మార్చి 16 మొదలు పీపుల్స్ పాదయాత్రను మొదలు పెట్టానని... పీపుల్స్ మార్చ్..హాత్ సే హాత్ జోడో యాత్రలు..రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపు అని వెల్లడించారు. దేశమంతా ఒకటై ఉండాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తు చేశారు.109 రోజుల పాటు  కొండల్లో, వాగుల్లో, ఎండల్లో, వానల్లో  నడుస్తూ..బడుగు బలహీన వర్గాలతో మాట్లాడానన్నారు. రైతులు, అనేక వర్గాల ప్రజలతో మమేకమై..వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. అలాగే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోందో వివరించానని తెలిపారు.  యావత్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర సంపదను పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆకాంక్షించారు. పాదయాత్రలో ప్రజలు తనను అడుగడుగునా ప్రోత్సహించారన్నారు.