- ప్రయాణికులను ఆరా తీసిన డిప్యూటీ సీఎం
- ఖమ్మం పాత బస్టాండ్ నుంచి జగన్నాథపురం వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణం
ఖమ్మం, వెలుగు : ‘ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉంది ? ఫ్రీగా ఎన్నిసార్లు ప్రయాణం చేశారు ?’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఆయన ఖమ్మం పాత బస్టాండ్‌లో పల్లె వెలుగు బస్ ఎక్కి బోనకల్ మండలం జగన్నాథపురం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఫ్రీ బస్ స్కీమ్, ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. ఫ్రీ బస్ కారణంగా డబ్బులు మిగులుతున్నాయని, ఆర్థికంగా వెసులుబాటు కలుగుతోందని నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మ సమాధానమిచ్చారు. అలాగే జీరో టికెట్ల జారీ విధానాన్ని కండక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్రీ బస్‌తో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినందున కొత్త బస్సుల అవసరం ఏర్పడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లోన్లు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడపాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఖమ్మం పాత బస్టాండ్‌లో పాతర్లపాడు గ్రామానికి వెళ్లే బస్సును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఆయన వెంట వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న పాల్గొన్నారు.