ప్రతి గ్యారెంటీని తప్పక అమలు చేస్తాం : భట్టి  విక్రమార్క

  • రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు కాంగ్రెస్​కే ఉంది 
  • ఉప ముఖ్యమంత్రి భట్టి  విక్రమార్క

మునుగోడ, వెలుగు:  కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి గ్యారెంటీని తమ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ​నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంప్ ఆఫీసులో మునుగోడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఇందులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేసిందని, రాష్ట్రంలో ఓట్లడిగే నైతిక హక్కు కాంగ్రెస్​ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా ఆదరించి గెలిపించారో, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలన్నారు. అతి త్వరలో మునుగోడు  నియోజవకవర్గ ప్రజలు శుభవార్త వింటారన్నారు. కాంగ్రెస్ నాయకులు, సినీ నటుడు బండ్ల గణేష్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, డీసీసీబీ డైరెక్టర్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి, నారాబోయిన రవి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, గుప్త ఉమ, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, నాంపల్లి జడ్పీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు పాల్గొన్నారు.