నల్గొండ, వెలుగు : సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జిల్లా కాంగ్రెస్ లో ఘర్షణలకు దారితీస్తోంది. దేవరకొండలో నక్కలగండి ప్రాజెక్టు వద్ద యాత్ర మొదలైనప్పటి నుంచే పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. దేవరకొండలో భట్టి సమక్షంలోనే లీడర్లు కొట్టుకోవడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. కొండమల్లేపల్లి కార్నర్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, కిషన్ నాయక్‌లు మైక్ కోసం కొట్లాడుకున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే సీటు కోసం కిషన్ నాయక్, రవి నాయక్, బిల్యా నాయక్‌కు, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌కు మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. భట్టి ముందు రవి, కిషన్‌లు బలప్రదర్శనకు దిగారు. యాత్ర పొడవునా అల్లర్లు సృష్టించారు. ఒకానొకదశలో బాలు, రవి వర్గీయులు పోలేపల్లి వద్ద ఘర్షణ పడ్డారు. తర్వాత దేవరకొండలో రవి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు.
గుర్రంపోడులో మారిన సీన్..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలోకి భట్టి యా త్ర ప్రవేశించాక పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించింది. జన సమీకరణపై జానారెడ్డి వర్గం పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. అసలు భట్టి యాత్ర సమాచారమే తమకు తెలియదని మండల నాయకులు చెప్తున్నారు. చివరకు జానారెడ్డి రెండో కొడుకు జయవీర్ రెడ్డి మంగళవారం జనాన్ని తరలించి కార్నర్ మీటింగ్ నడిపించారు.
సూర్యాపేటలో బీసీ డిక్లేరేషన్ పైనా అనుమానాలు...
సూర్యాపేటలో బీసీ డిక్లరేషన్ పెట్టాలన్నది పార్టీ ఉద్దేశం. దీనికి కర్నాటక, రాజస్థాన్ సీఎంలు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్లను ఆహ్వానించాలని అనుకుంటున్నారు. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి వర్గాలు నువ్వానేనా అన్నట్టుగా పనిచేస్తోన్నాయి..
నల్గొండలో ప్రియాంక సభ పైన ఫోకస్...
త్వరలో నల్గొండలో జరిగే ప్రియాంక సభ పైనే అందరు దృష్టి పెడుతున్నారు. సభ ఏర్పాటు కోసం ఎంపీ వెంకటరెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తె లిసింది. ఒకవేళ ప్రియాంక మీటింగ్‌లే కుంటే నల్గొండలో భట్టి యాత్ర ఎలా జరగుతుందనే దానిపై కేడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వర్గానికి చెందిన పలువురు ముఖ్యులు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకోవైపు సీనియర్ నే త దుబ్బాక నర్సింహారెడ్డి కాంగ్రెస్‌లో దూకుడు పెంచారు.
నకిరేకల్ జన సమీకరణ పైన తర్జనభర్జన...
నకిరేకల్లో భట్టి యాత్ర గురించి అప్పుడే చర్చ మొదలైంది. యాత్రకు జన సమీకరణ ఎవరు చేయాలనే దానిపైన మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవైపు జానారెడ్డి ముఖ్య అనుచరుడు కొండేటి మల్లయ్య, ఇంకోవైపు ఎంపీ కోమటిరెడ్డి కోటరీలో దైదా రవీందర్, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య కొడుకు శ్రీధర్ వర్గం బలంగా పనిచేస్తోంది. కోమటిరెడ్డి పిలుపు మేరకు ఇటీవల నల్గొండలో జరిగిన రే వంత్ నిరుద్యోగ సభకు శ్రీధర్ జన సమీకరణ చేయగా, అంతే దీటుగా మల్లయ్య సైతం పోటీ పడ్డారు. అయితే ఇటీవల కోమటిరెడ్డి బర్త్‌డే వేడుకల్లో శ్రీధర్ క్రియాశీలకంగా మారడం కొత్త పరిణామాలకు దారితీసింది. దాంతో యాత్రకు జన సమీకరణ చేస్తే ఆ క్రెడిట్ ప్రత్యర్థి ఖాతాలో పడుతుందేమోనని ఆశావహులు భయపడుతున్నారు.