ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచండి

ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచండి
  •     అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

హైదరాబాద్, వెలుగు : అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాబట్టుకోవాలని, ఈ ఆర్థిక సంవత్సరం టార్గెట్లను చేరుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రజలపై భారం పడకుండా రాబడి పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్ లో ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో భట్టి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆదాయం పెంచుకునేందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. 

గతంలో నిర్దేశించుకున్న ప్రణాళికలు, వాటి ప్రగతిని నివేదించాలని చెప్పారు. లీకేజీలను అరికడుతూ ఆదాయం పెంచేందుకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, జాయింట్ కమిషనర్,  విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వైన్స్ లో ఎమ్మార్పీ  కన్నా ఎక్కువ రేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని,  వాటిని అరికట్టేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. 

సమన్వయంతో పని చేయండి..

ఆదాయం పెంచేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని, అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని అధికారులకు భట్టి సూచించారు. అక్రమ ఇసుక రవాణా, పన్నుల ఎగవేతను కట్టడి చేయడానికి కమర్షియల్ ట్యాక్స్, రోడ్లు, భవనాలు, ఇతర అధికారులు సమావేశమై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇండ్లను విక్రయించే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. 

ఇసుక రీచ్ ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై రిపోర్ట్​ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్​రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మైనింగ్ సెక్రటరీ సురేంద్రమోహన్, సెర్ప్​ సీఈవో దివ్య దేవరాజన్, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.