భూమిలేని పేదల అకౌంట్లో రూ. 12 వేలు

భూమిలేని పేదల  అకౌంట్లో రూ. 12 వేలు
  • ఈ ఏడాది నుంచే అమలు చేస్తం
  • త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
  • ఎస్సీ, ఎస్టీలకు రూ.  6 లక్షలు, మిగతా వారికి రూ. 5 లక్షల చొప్పున ఇస్తం
  •  సోలార్ పంపు సెట్ల కోసం సిరిపురం ఎంపిక
  • ఉప ముఖ్యమంత్రి మల్లు  భట్టి విక్రమార్క

ఖమ్మం: ఈ ఏడాది నుంచి  భూమిలేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాది 12 వేలు వేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెండో విడుత  దళిత బంధు మంజూరు పత్రాలను డిప్యూటీ సీఎం లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..  నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం  ప్రజాస్వామ్య పరిపాలనలోకి  వచ్చినందున ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో  ప్రజా ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను  వ్యతిరేకించిన వారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే. అవుతుందన్నారు. సెప్టెంబర్ 17 దినోత్సవం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న  పార్టీల నాయకులు ప్రజా ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలన  దినోత్సవాన్ని స్వాగతించాలని కోరారు. 

 రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షల రూపాయలు ఇతర లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ అందిస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ, పంటల బీమా, రైతు బీమా, సబ్సిడీ విద్యుత్తు అందించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సోలార్ వ్యవసాయ పంపు సెట్లు తీసుకొస్తున్నామని వివరించారు. 

మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. సోలార్ విద్యుత్తు వ్యవసాయం పంపు సెట్ల వినియోగానికి పోగా  మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పిస్తుందని చెప్పారు.