- రైతులకు ధరణి గుబులు పుట్టిస్తున్నది
- ప్రభుత్వ అధికారిగా కాకుండా కేసీఆర్ కాళ్లు డీహెచ్ ఎన్నిసార్లయినా మొక్కొచ్చు
- కేంద్ర, రాష్ట్ర సర్కార్లు లొల్లితో ప్రజా సమస్యలు డైవర్ట్ అవుతున్నాయని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు సర్కార్ వైఫల్యమే కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోడు భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా లేట్ చేస్తూ, పరిష్కారం చేయకపోవడం వల్లే శ్రీనివాసరావు ప్రాణం పోయిందని ఆయన మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ర్టం ఏర్పాటు నుంచి తాము కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం చట్టప్రకారం చేయాల్సిన తంతు చేయకపోవడం వల్లే సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు చైర్మన్ గా ఉండే ల్యాండ్ అసైన్డ్ కమిటీ సమావేశాలు జరగడం లేదన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల పార్టు- బీలో ఉన్న రైతులు భూమిపై హక్కులు లేవన్న భయంతో బతుకుతున్నారు. భూసేకరణ చేసినా ఇండ్ల పట్టాలు పంపిణీ చేయని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో బాధితులు భారీగా తరలివచ్చి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు” అని భట్టి తెలిపారు. ఇక హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా శ్రీనివాస్ రావు వ్యక్తిగతంగా ఎన్నిసార్లు కేసీఆర్ కాళ్లు మొక్కినా తమకు అభ్యంతరం లేదన్నారు.
మర్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న
గాంధీని చంపిన గాడ్సే పార్టీ అని బీజేపీని విమర్శించిన మర్రి శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ పై , పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని భట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మర్రి ఆయనకు సీఎంగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అలాంటి పార్టీని వదిలి ఆయన బీజేపీలో చేరతాననడం బాధాకరమన్నారు.
కొత్త వ్యక్తిని సీఎల్పీగా పెట్టుకోవచ్చు
తనకు ఎవరితోనూ భేషజాలు లేవని, అభిప్రాయ భేదాలు ఉన్న, మనస్తాపానికి గురైన నాయకులతో ఎవరితోనైనా సీఎల్పీ నేతగా మాట్లాడతానని భట్టి తెలిపారు. ఏమైనా విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకుందామని సూచించారు. ‘‘జగ్గా రెడ్డి అభిప్రాయాలను నేను గౌరవిస్తా. నేను జగ్గారెడ్డితో మాట్లాడుతా. నా దగ్గరకు జగ్గా రెడ్డి ఏ విషయం తెచ్చినా నేను స్వీకరిస్తా. ఆయన ఆశించిన విధంగా నేను పనిచేయలేక పోతే కొత్త వ్యక్తులను సీఎల్పీగా పెట్టుకోవచ్చు” అని భట్టి పేర్కొన్నారు. ఇక కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పరం చేసుకుంటున్న విమర్శల దాడి వల్ల ప్రజా సమస్యలు పక్కదారి పట్టాయని ఆయన అన్నారు. సమస్యలపై ప్రజలు ఆలోచన చేయకుండా ప్లాన్ ప్రకారంగా బీజేపీ, టీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని భట్టి మండిపడ్డారు.