హైదరాబాద్, వెలుగు: పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్రంలో హరిత భవన నిర్మాణాలు జరగాలని, దానికి తగ్గట్టు జీవన విధానాలు మారాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పచ్చని వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాన్యుడు కొనుగోలు చేసేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలని చెప్పారు. 50 శాతం నీరు, 40 శాతం కరెంట్‌ను ఆదా చేసేలా నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్‌కు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం, సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
హైటెక్స్‌లో సీఐఐ, ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్బిల్డింగ్ ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం అని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే తెలంగాణ రాష్ట్రం పట్టణ రాష్ట్రంగా మారుతుందని అన్నారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్న మొదటి మూడు దేశాల్లో మన దేశం ఒకటి కావడం శుభసూచకమని ఆయన తెలిపారు.
రెప్పపాటు కూడా కరెంట్ పోవట్లే
‘‘అన్ని గ్రామాల్లో గ్రీన్, జీరో కార్బన్ ఎమిషన్స్ కాన్సెప్ట్‌లను సులభతరం చేయడానికి సీఐఐ, ఐజీబీసీలూ మాకు సహకరించాలి. రాబోయే కొద్ది రోజుల్లో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటుంది. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా నిలబెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. రెప్పపాటు సమయం కూడా కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన కరెంట్‌ను నిరంతరంగా అందిస్తున్నాం” అని భట్టి విక్రమార్క చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో సమగ్ర ఇంధన పాలసీని తీసుకువస్తామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా కొత్తగూడెంలో రూ.56 కోట్లతో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఇటీవల ప్రారంభించామని చెప్పారు. ఏడాదిలోగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలోని ఖాళీ స్థలాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడం, భారీ సాగునీటి ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్, సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
మాది బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
హైదరాబాద్ కు గ్లోబల్ సిటీ సదుపాయాలు కల్పిస్తున్నామని, పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకుల దూర దృష్టి మూలంగానే ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, హైదరాబాద్ కు కృష్ణ జలాలు, మెట్రో రైలు, హైటెక్ సిటీకి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టినవే” అని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. ‘‘ప్రజలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు అందరికీ ఈ ప్రభుత్వం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
రీజనల్ రింగ్ రోడ్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జిల్లాలను, అక్కడి ఉత్పత్తులను హైదరాబాద్ నగరానికి అనుసంధానం చేయడంలో రీజినల్ రింగ్ రోడ్డు తోడ్పడుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య పారిశ్రామిక క్లస్టర్లు నిర్మిస్తాం. ఈ రెండింటి మధ్యలో పరిశ్రమలు భారీగా వస్తాయి. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. దీంతో భారీగా ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. గతంలో కూకట్ పల్లి, ఈసీఐఎల్, హౌసింగ్ బోర్డ్ వంటివి ఈ తరహాలోనే రూపుదిద్దుకున్నాయి’’ అని ఆయన వివరించారు. మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ నది మాదిరిగా ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. నగరం నలుమూలల మెట్రో రైలును విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. తమది బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఆయన చెప్పారు.